సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన పౌరాణిక చిత్రం శాకుంతలం ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే సినిమా విజయం పై సమంతతో పాటు చిత్ర యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే శాకుంతలం ప్రేక్షకులను నిరాశ పరచడంతో ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది.
దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఫస్ట్ వీకెండ్ లో వసూళ్లు కేవలం 8 కోట్ల గ్రస్ మాత్రమే. 4 కోట్ల స్థాయిలో కూడా షేర్ రాకపోవడంతో పాటు ఈ రోజు నుంచి ఈ సినిమాకు ఎలాంటి షేర్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమా క్లోజింగ్ షేర్ 4 కోట్లకు మించదు కాబట్టి సినిమా ఎపిక్ డిజాస్టర్ గా మారిందనే చెప్పాలి.
పౌరాణిక నేపథ్యంతో ఎంగేజింగ్ రొమాంటిక్ డ్రామాగా నిలిచేలా ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అసమర్థమైన కథనం, బలవంతపు భావోద్వేగాలు ఈ సినిమాను మరీ పేలవంగా మార్చడంతో ప్రేక్షకులు పాత్రలకు గానీ, సినిమాకు గానీ కనెక్ట్ కాలేకపోయారు.
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన కాళిదాసు సంస్కృత నాటకం ‘అభిజ్ఞా శాకుంతలం’ ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందిన శాకుంతలం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలయిన విషయం తెలిసిందే. 3డిలో కూడా విడుదలయిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ తో కలిసి నీలిమ గుణ నిర్మించారు.
సమంత నటించిన శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో దుష్యంత మహారాజు పాత్రలో దేవ్ మోహన్ నటించగా, ప్రిన్స్ భరతుడిగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించారు. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధు బాలా, సచిన్ ఖేడేకర్, మోహన్ బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు సమకూర్చారు.