సమంత నటించిన శాకుంతలం, రాఘవ లారెన్స్ నటించిన రుద్రుడు చిత్రాలు ఈ శుక్రవారం పోటీగా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జానర్స్ కు చెందినవి. శాకుంతలం ఒక పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా కాగా, రుద్రుడు కంప్లీట్ యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కింది.
దీంతో ట్రేడ్ వర్గాలు ఈ రెండు సినిమాల తాలూకు బజ్ ను బట్టి అంచనాలు పెట్టుకున్నాయి కానీ ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు మంచి వసూళ్లను రాబట్టలేక పోయాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు సినిమాలకు కలిపి దాదాపు 1.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టడంతో ఈ రెండు సినిమాలు పేలవమైన వసూళ్లతో ప్రారంభమయ్యాయి.
రుద్రుడు సినిమా ప్రీ బిజినెస్ 7 కోట్లు కాగా, శాకుంతలం ప్రీ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్లకు పైగా జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఓపెనింగ్స్ సాధించిన తర్వాత ఈ రెండు సినిమాలకు ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ మార్క్ అసాధ్యంగా కనిపిస్తోంది.
కాళిదాసు రచించగా అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం నుంచి స్ఫూర్తి పొంది శాకుంతలం చిత్రాన్ని రూపొందించారు. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సమంత శకుంతల పాత్రలో నటించిగా.. దేవ్ మోహన్ ఆమె భర్త రాజు దుష్యంతునిగా నటించారు. గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాల పై నీలిమ గుణ, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసారు.
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత రాఘవ లారెన్స్ నటించగా తెలుగులో విడుదలైన చిత్రం ‘రుద్రుడు’. లారెన్స్ గతంలో తన ముని, కాంచన సినిమా సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన రుద్రుడు అనే యాక్షన్ రివెంజ్ డ్రామాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే ఈసారి లారెన్స్ డైరెక్షన్ చేయకుండా కేవలం హీరోగానే నటించారు. కదిరేశన్ ఈ చిత్రానికి దర్శకుడు మరియు నిర్మాత.