తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ మరియు స్టార్ డం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం ఇప్పుడు మరోసారి అందరికీ పోకిరి సినిమా రుజువు చేస్తోంది.
ఈ సినిమా వచ్చి చాలా కాలం అయినప్పటికీ కూడా దాని ప్రభావం అటు మహేష్ అభిమానులలో.. ఇటు సాధారణ ప్రేక్షకులలో ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు.
15 ఏళ్ళకి పైగా పోకిరి చిత్రం ఎన్నో సార్లు టీవీలలో ప్రసారం అయినా.. ప్రస్తుతం యూట్యూబ్ లో కూడా మొత్తం సినిమా అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆ సినిమాని మళ్ళీ థియేటర్లో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది పోకిరి సినిమాని కొన్ని సెంటర్లలో ప్రత్యేక షోలను ప్రదర్శించి వేడుక చేసుకోవడం అభిమానులకు అలవాటు.
అయితే ఈ సారి మాత్రం పోకిరి సినిమాను ఎవరూ ఊహించని స్థాయిలో ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు మహేష్ అభిమానులు. నిజానికి మొదట హైదరాబాద్లో కేవలం 12 స్క్రీన్లలో మాత్రమే పోకిరి సినిమాను ప్రదర్శించాలని అనుకున్నారట. కానీ అభిమానుల నుంచి టికెట్ల కోసం డిమాండ్ ఊహించిన దానికంటే ఎక్కువగా అంతకంతకూ పెరుగుతూ పోవడంతో ఆ ప్రత్యేక షో ల సంఖ్యను పెంచాల్సి వచ్చింది. మొత్తంగా మహేష్ పుట్టిన రోజు నాడు 150 షోల వరకు ప్రదర్శించబోతుండటం విశేషం.
ఇక ఓవర్సీస్ లో కూడా పోకిరి చిత్రాన్ని 17 లొకేషన్లలో 24 షోలు ప్రదర్శించబోతున్నారు అని తెలుస్తోంది. పోకిరి స్పెషల్ షోలకు ఎంతగా డిమాండ్ ఉన్నదంటే .. దాదాపు 30 షోలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా పోకిరి సినిమా కేవలం ప్రత్యేక షోల ద్వారానే ఒక కొత్త సినిమా స్థాయిలో ఒక సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది.
అయితే ఈ ప్రత్యేక షోల ద్వారా వచ్చిన డబ్బును మహేష్ అభిమానులు ఒక మంచి పని కోసం ఉపయోగించబోతున్నారు. మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకి గుండెకు సంబందించిన చికిత్సను ఉచితంగా అందించి అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే ఎంతో మంది చిన్నారులకు మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో సర్జరీలు కూడా చేయించారు. అయితే ఇప్పుడు పోకిరి సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్స్ కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ మహేష్ బాబు ట్రస్ట్ కోసం అంధించబోతున్నట్లు సమాచారం.