తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటిగా తమకంటూ పేరును నిలబెట్టుకున్న అతికొద్ది మంది నటీమణులలో సీనియర్ నటి ఆమని ఒకరు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తన కఠోర శ్రమతో నటిగా అవకాశం దక్కించుకున్న తర్వాత అద్భుతమైన నటనా కౌశలంతో అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.
తనకు నటి కావాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని, తన కలలను వదలకుండా నెరవేర్చుకునేందుకు తన ప్రయత్నాలను కొనసాగించానని ఆమని తెలిపారు. చాలా మంది నటీమణులు పరిశ్రమలోకి ప్రవేశించినట్లే అమని కూడా చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆమె ఆడిషన్ల కోసం అప్పట్లో ప్రొడక్షన్ కంపెనీలకు వెళ్లేవారని, ఆ సమయంలో కొన్ని కంపెనీలలో ఎంపిక చేస్తే మరి కొన్ని మాత్రం ఆమెకు ఏ నిర్ణయం అనేది తర్వాత చెప్తామని అనేవారట. అలా అన్న కొన్ని రోజులకు ఫోన్ చేసి ఆమనిని రమ్మనేవారట.
ఆమని ప్రకారం, ఆమెకు ప్రొడక్షన్ యూనిట్ నుండి కాల్స్ వచ్చినపుడు.. దర్శకుడు ఆమెను కలవాలనుకుంటున్నారని వారు తెలియజేసేవారట. అయితే కారణం ఏమిటని అడిగిన పక్షంలో, మేకప్ టెస్ట్ అని చెప్పేవారట. అయితే వారు అలా అనడంలో ఆంతర్యం ఏమిటో తనకు తర్వాత అర్థం అయిందని ఆమని అన్నారు.
ఆమని అలా ఫోన్ కాల్స్ వచ్చిన సందర్భాల్లో ఆమె తన తల్లితో వస్తానని చెప్పినప్పుడు, వారు నిరాకరించారని మరియు ఆమెను ఒంటరిగా రమ్మని పట్టుబట్టారని పేర్కొన్నారు. ఆ తరువాత ఎందుకు ఒంటరిగా రమ్మని అన్నారో తెలుసుకున్న ఆమని తల్లి, ఆమె ఒంటరిగా రాదని, తనతో పాటే కలిసి వస్తారని ఖరాఖండిగా చెప్పేశారట.
ఈ రాజీలేని వైఖరి కారణంగా, ఆమని చాలా అవకాశాలను కోల్పోయారు, ఎందుకంటే ఆమె తన తల్లితోనే వస్తానని వారికి తెలియజేసినప్పుడు దర్శకులు ఆమెను వెంటనే తిరస్కరించారట. అందుకే ఆమె వెండితెర పైకి హీరోయిన్ గా రావడానికి రెండేళ్లు పట్టింది.
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది కొత్త విషయం కాదు, గతంలో చాలా మంది నటీమణులు దీనిని ఎదుర్కొన్నారు మరియు నేటికీ ఈ సమస్య వారి కెరీర్‌ను ప్రభావితం చేస్తూనే ఉంది. కెరీర్ కోసం కొందరు హీరోయిన్లు రాజీ పడుతుండగా, కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇలాంటి చెడు కార్యకలాపాలకు ఎదురు తిరుగుతున్నారు.