2022 సంక్రాంతి తెలుగు సినిమా పరిశ్రమకు నీరసమైన వ్యవహారంగా నిలిచింది. పెద్ద సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో పండగ సీజన్‌కు అనుకున్న సినిమాలు వాయిదా వేయాల్సి రావటంతో సంక్రాంతి పండగకి ఉండాల్సిన కళ లేకుండా పోయింది.
అయితే సంక్రాంతి 2023 అందుకు పూర్తి భిన్నంగా ఉండబోతోంది. భారీ బడ్జెట్ తో కూడిన టాలీవుడ్ సినిమాలతో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న సినిమాలు కూడా ఈ సంక్రాంతికి విడుదల కానుండటం విశేషం.
ఈ సంక్రాంతికి విడుదల అయ్యే సినిమాల్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో పాటు తమిళ సూపర్ స్టార్ విజయ్ మరియు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న ద్విభాషా చిత్రం వారసుడు/వారిసు కూడా సంక్రాంతికి విడుదల అవుతుంది.
కాగా ఈ చిత్రాలే కాకుండా, బాలకృష్ణ మరియు శ్రుతి హాసన్ నటించగా తాజాగా వీరసింహారెడ్డి అనే టైటిల్ ఖరారు చేసుకున్న చిత్రం, అలాగే అక్కినేని అఖిల్ ఏజెంట్ కూడా 2023 సంక్రాంతికి విడుదల కానున్నట్లు సమాచారం.
వీరసింహరెడ్డి సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ యొక్క చిత్రీకరణ జరుపుకుంటోంది మరియు ఇటీవల విడుదలైన టీజర్‌ను గమనిస్తే, ఇది అఖండ వంటి మరో యాక్షన్-ప్యాక్డ్ మాస్ చిత్రం కానుందనే అనిపిస్తోంది.
ఈ భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు, చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తూ.. రవితేజ ముఖ్య అతిథి పాత్రలో మరియు శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన మరో భారీ తెలుగు సినిమా వాల్తేరు వీరయ్య సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంది.
ఈ సినిమాలన్నీ ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా తమ తమ విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించాయి. మొత్తంగా ఐదు సినిమాలు ఈ సంక్రాంతి పండగకు పోటీ పడబోతున్నాయి.
ఇది ఖచ్చితంగా టాలీవుడ్‌లో ఎన్నడూ కనీ వినీ ఎరుగని అతి పెద్ద బాక్సాఫీస్ పోరు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి 2023 సంక్రాంతి పోరులో తుది ఫలితం ఎలా ఉంటుందో ఎవరి సినిమా పై ఎవరి సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.