అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత అదే సినిమాను కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ లోనూ భారీ ప్రభావం చూపించారు. అలా ఒకే ఒక్క సినిమాతో సందీప్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ప్రతి స్టార్ హీరోతో పాటు వారి అభిమానులు కూడా తమ తదుపరి చిత్రానికి ఆయనే డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నారు.
దీంతో సందీప్ కు పలువురు స్టార్ హీరోల నుంచి ఆఫర్లు వరుసగా వచ్చాయి. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తున్నారు సందీప్. దీని తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నట్లు నిన్ననే అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ కూడా రాజమౌళితో సినిమా తర్వాత సందీప్ తో ఒక సినిమా చేయడం దాదాపు ఖరారు అయింది.
ఈ సినిమాలతో సందీప్ వంగా మరో ఐదేళ్ల పాటు లాక్ అయ్యారనే విషయం ఇప్పుడు స్పష్టమైంది. స్టార్ హీరోలతో సినిమాలు చేయడం, వారి అభిమానులను సంతృప్తి పరచడం అనేది ప్రస్తుతం ఆయన భుజస్కంధాల పై ఉన్న చాలా పెద్ద బాధ్యతగా చెప్పవచ్చు. మరి ఈ యువ దర్శకుడు తన బిజీ షెడ్యూల్ లో పని చేయడంతో పాటు భారీ అంచనాలను ఎలా అధిగమిస్తాడో వేచి చూడాలి.
తెలంగాణలోని వరంగల్ లో పెరిగిన సందీప్ రెడ్డి వంగా పక్కా సినిమా అభిమాని. చిరంజీవి సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం ఆయనకు ఆనవాయితీగా ఉండేది. అర్జున్ రెడ్డి/కబీర్ సింగ్ క్యారెక్టరైజేషన్ విషయంలో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు కొన్ని వివాదాలు కూడా ఆయన ఎదురుకున్నారు. బాలీవుడ్ విమర్శకులు ఆయన పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే యానిమల్ తో మరింత హింసాత్మక చిత్రం చేస్తానని సందీప్ వారికి మాటిచ్చారు.