సినిమాల్లో అవకాశాలు రావడం అంత సులభం కాదు.అందం/టాలెంట్ మాత్రమే ఉంటే చాలదు వాటితో పాటు కొద్దిపాటి అదృష్టం కూడా కావాలి. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇతర బాషల నుంచి తెలుగులో సినిమాలు చేయడానికి చాలా హీరోయిన్ లు ప్రయత్నిస్తున్నారు.
దానికి కారణం ఇక్కడి ప్రేక్షాభిమానమే,కన్నడ నుంచి వచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు ఇక్కడ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకొని పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది.అలాగే పూజా హెగ్డే,కీర్తీ సురేష్ వంటి హీరోయిన్ లు చాలా మంది తెలుగు సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మరో మలయాళ భామ అదే బాటను ఎంచుకుంది.
భీమ్లానాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ సంయుక్త మీనన్. త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా సరసన నటించింది సంయుక్త. ఈ సినిమా హిట్ అయినప్పటికీ, క్లైమాక్స్ లో సంయుక్త నటనకు పేరు వచ్చినప్పటికీ ఇప్పటిదాకా మరో సినిమా అవకాశం రాలేదు.
ఈ సమయంలో ఆమెకు ఓ భారీ సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. `వినోదాయ సితం’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నారని పుకార్లు వచ్చాయి కానీ ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.అయితే ఈ సినిమాకు హీరోయిన్ గా సంయుక్తను త్రివిక్రమ్ సిఫార్స్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
భీమ్లానాయక్ సినిమాలో సంయుక్త నటనకు మెచ్చి గురూజీ ఈ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. ఈ సినిమా హిట్ అయితే సంయుక్త కూడా తెలుగులో వరుస ఆఫర్లు అందుకొని స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.అది నిజం అవ్వాలనే కోరుకుందాం.