సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం విరూపాక్ష ఈ శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే హీరో సాయి ధరమ్ తేజ్ నటన పై ఎవరూ ఊహించని రీతిలో విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా తన సినిమా కంటెంట్ తో కానీ, రిజల్ట్ తో కానీ సంబంధం లేకుండా సాయి ధరమ్ తేజ్ తన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ తో ఎప్పుడూ మెస్మరైజ్ చేస్తుంటారు.
కానీ విరూపాక్షలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్, పెర్ఫార్మెన్స్ ఇలా అన్నీ ఆశించిన స్థాయిలో లేవని, సినిమాలో తన నటనతో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారని ప్రేక్షకులు అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త మీనన్ నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి.
అయితే కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మన్స్ పరవాలేదు అని, బహుశా ఇటీవలే ఆయనకు జరిగిన యాక్సిడెంట్ సినిమా కోసం ఆయన చూపిన పనితీరు పై ప్రభావం చూపి ఉండొచ్చని అంటున్నారు. ఏదేమైనా విరూపాక్ష ఫలితం ఖచ్చితంగా సాయి ధరమ్ తేజ్ కి ఘోరమైన యాక్సిడెంట్ తర్వాత సంతోషాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన తదుపరి సినిమాతో నూటికి నూరు శాతం రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుందాం.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన విరూపాక్ష చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో విడుదల కావాల్సి ఉన్నా అనుకోని కారణాల వల్ల తెలుగులోనే విడుదలైంది. బి.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి షామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించారు.
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, అజయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రుద్రవనం అనే గ్రామంలో జరిగే అపరిష్కృత అంశాల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి సుకుమార్ రచనా భాద్యతలను నిర్వర్తించారు.