యాక్షన్ ఎపిక్ ఆర్ఆర్ఆర్ నిన్న USA లో రీ రిలీజ్ కాగా ఈ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ స్ట్రాంగ్ గా స్టార్ట్ అవటం విశేషం. శుక్రవారం ఈ చిత్రం 50K డాలర్ల వరకూ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఆస్కార్ అవార్డులకు సంబంధించి సినిమా పై ఉన్న క్రేజ్, హైప్ దృష్ట్యా వీకెండ్ సూపర్బ్ కలెక్షన్స్ సాధించేందుకు సిద్ధం అవుతుందని అంచనా వేస్తున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ 2022 మార్చిలో విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా తన మ్యాజిక్ కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాను 2023 ఆస్కార్ ప్రమోషన్లో భాగంగా మార్చి 1న USA ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్ గా విడుదల చేశారు. కాగా ఆ స్క్రీనింగ్ కూడా హౌస్ ఫుల్ అవడం విశేషం. 1,600 టికెట్లు అమ్ముడుపోగా, వెండి తెరపై ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు చాలా మంది క్యూ కట్టారు.
2023 ఆస్కార్ అవార్డ్స కు ముందు ఆర్ఆర్ఆర్ ను మరోసారి చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. చిత్ర నిర్మాతలు ట్వీట్ చేసి అమెరికన్ థియేటర్ కు సంబంధించిన కొన్ని దృశ్యాలను పంచుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే షో హౌస్ ఫుల్ కావడంతో మళ్లీ సినిమా చూసేందుకు అభిమానులు క్యూలైన్లలో నిరీక్షించారు. మార్చి 12న జరగనున్న 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మాతలు ఈ స్పెషల్ స్క్రీనింగ్ ను ఏర్పాటు చేశారు. స్పెషల్ స్క్రీనింగ్ కు ముందు ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఏస్ హోటల్ లో ప్రేక్షకులతో మాట్లాడారు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 2023 ఆస్కార్ కు ‘ఆర్ఆర్ఆర్’ నాటు నాటు పాట నామినేట్ అయింది. అంతే కాకుండా ఈ పాటను గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించనున్నారు. ఆర్ఆర్ఆర్ అవార్డు సాధించబోతుంది అని తెలుగు సినీ ప్రేమికులు గర్వంగా ఫీలవుతున్నారు. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లతో పాటు ఆర్ఆర్ఆర్ టీం మొత్తం ఈ గ్రాండ్ నైట్ కు హాజరు కానున్నారు.