‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ వద్ద సాధించిన ఘన విజయం యావత్ ప్రపంచంలోని తెలుగు సినీ ప్రేమికులకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. అదే సమయంలో ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ కు కానీ..ఆ తర్వాత జరిగిన వేడుకలకు ఈ చిత్రం యొక్క నిర్మాత డీవీవీ దానయ్య గైర్హాజరు కావడం కూడా కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది.
గత నెల ప్రారంభంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ క్యాంపెయిన్ పై దానయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. యూఎస్ఏకు వెళ్లే ముందు చిత్ర బృందం నుంచి ఎవరూ తనను సంప్రదించలేదని నిర్మాత పేర్కొన్నారు. ఆస్కార్ ప్రచారానికి అయ్యే ఖర్చు పెట్టడానికి నిర్మాత ఏమాత్రం ఆసక్తి చూపలేదని ఇండస్ట్రీ సమాచారం. ఒక సాధారణ ఆస్కార్ ప్రచారానికి భారీ మార్కెటింగ్, పర్యటన మరియు అవుట్ రీచ్ కార్యకలాపాలు అవసరం, వాటి పై దానయ్య పెద్దగా ఆసక్తి చూపలేదట.
అందుకే దానయ్య ఆ తర్వాతి వేడుకలకి దూరంగా ఉంటున్నారు. గత ఆదివారం ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అవార్డు గెలిచినందుకు గానూ అభినందిస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరైనా నిర్మాత దానయ్య మళ్ళీ మిస్సయ్యారు. రాజమౌళికి, నిర్మాతకు మధ్య విభేదాలు ఎలా ఉన్నా ఆయన ఆ కార్యక్రమానికి గైర్హాజరు కావడం బయటకి అంత మంచిగా వెళ్ళలేదు.
రాజమౌళి సినిమా అంటే స్వతహాగా నిర్మాతకు భారీ లాభాలు వస్తాయని.. అయితే అందరూ ఊహించినట్లుగా ఈ సినిమాతో తాను ఆర్థికంగా సంతోషంగా లేనని గతంలో దానయ్య చెప్పుకొచ్చారు. నిజానికి ఈ సినిమా కొన్ని ఏరియాల్లో ఆశించినంతగా ఆడలేదు.