కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సరికొత్త చిత్రం 777 చార్లీ. ఈ సినిమా గత నెలలో(జూన్ 10) విడుదలై సూపర్ హిట్ అవడంతో పాటు ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుంది. కన్నడతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ చిత్రం విడుదలైంది. కిరణ్ రాజ్ కే తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు బాక్స్ ఆఫీసు వద్ద కూడా విజయం సాధించింది. అయితే థియేటర్లలో ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధమైంది. జులై 29 నుంచి ఈ సినిమా వూట్ సెలక్ట్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది.
హీరో రక్షిత్ శెట్టి స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించారు. దాంతో పాటు ప్రేక్షకులకు తీయని సర్ప్రైజ్ ఇస్తూ సినిమాలో డిలీట్ చేసిన సన్నివేశాన్ని అందరితో పంచుకున్నారు. ఈ మేరకు 777 చార్లీ వూట్ సెలక్ట్ వేదికగా ఈ శుక్రవారం నుంచి ప్రసారం కానుందని తెలిపారు.
రక్షిత్ పంచుకున్న ఈ డిలీటెడ్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. చక్కని హాస్యం ఉన్న ఈ వీడియో చూసి సోషల్ మీడియాలో ప్రేక్షకులు విశేషంగా స్పందిస్తున్నారు. వూట్ సెలక్ట్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్, వెబ్ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఓటీటీ వేదిక సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే నెలకు రూ.99లు చెల్లించాలి, అదే ఏడాదికైతే రూ.199లు చెల్లించాలి.
ప్రేక్షకుల్లో ఎనలేని ఆదరణ పొందిన 777 చార్లీ చిత్రం ఒక క్లిష్టమైన కాన్సెప్ట్ తో రూపొందింది. హాలీవుడ్ తరహాలో ఒక మనిషికి కుక్కకి ఉన్న బంధం అనే కథని కామెడీతో మిళితం చేసి తెరకెక్కిన ఈ సినిమా నవ్విస్తూనే భావోద్వేగాన్ని కలిగించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది.
ఈ హిట్‌తో మంచి ఊపు మీదున్న హీరో రక్షిత్ శెట్టి ప్రస్తుతం “సప్త సాగరదాచే ఎల్లో” అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది చివరకు విడుదల కానుంది. హేమంతరావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పవిత్రా లోకేశ్, అచ్యుత్ కుమార్ తదితరులు ఇందులో నటిస్తున్నారు.