ఒక హీరో కెరీర్ లో సక్సెస్ అయి స్టార్ అయిన తర్వాత తన కొడుకు/తమ్ముడు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా హీరోగా పరిచయం చేయడం తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త విషయం ఏమీ కాదు. ఎందరో హీరోల వారసులు సినిమా రంగంలోకి హీరోలుగా అడుగుపెట్టి తమ సత్తా చాటారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్టులోకి మరో హీరో చేరబోతున్నారు.
యలమంచి రాణి సమర్పణలో JJR ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు LLP బ్యానర్ పై తాజాగా నిర్మిస్తున్న చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ సోదరుదు రఘు కుమారుడు మాధవ్ హీరోగా అరంగేట్రం చేయనున్నారు. కాగా ఈ చిత్రానికి పెళ్లిసందడి ఫేమ్ గౌరీ రోనంకి ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి ఆశీస్సులు మరియు శుభాకాంక్షలతో మొదలయ్యాయి. రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైన ఈ చిత్ర పూజా కార్యక్రమంలో నిర్మాత సురేష్ బాబు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరులు కూడా పాల్గొన్నారు.
సురేష్ బాబు కెమెరా ఆన్ చేయగా, రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌ని చిత్ర యూనిట్ కు అందించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తుండగా, రామ్ ఛాయాగ్రహణం, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రవితేజ పూజా వేడుకకు రాలేకపోయినా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా మాధవ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
దర్శకురాలు గౌరీ రోనంకి మాట్లాడుతూ.. ”ఈ సందర్భంగా నా తల్లిదండ్రులకు, నా గురువు కె. రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు. ఇది నా రెండో డెబ్యూ సినిమాగా భావిస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించేలా కార్యక్రమం నిర్వహించినందుకు సురేష్ బాబు గారికి కూడా నా ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి నాతో పాటు నా హీరో మాధవ్‌కి అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. ఆయన చెప్పినట్లు ఇదొక యూత్ ఫుల్ కలర్ ఫుల్ మూవీ అవుతుంది. మా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కథను బాగా మెచ్చుకున్నారు మరియు అతని సంగీత సహకారం మా చిత్రానికి బలాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.
హీరో మాధవ్ మాట్లాడుతూ.. ‘‘జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఇది నా రెండో ప్రాజెక్ట్. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం. సినిమా పూర్తయ్యే వరకు మరియు మీ అందరి సపోర్ట్ కావాలి. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అన్నారు.
త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించబోతోంది.