తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను, స్టార్ డం ను సంపాదించుకున్న హీరో రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టిన రవితేజ, ఒక రకంగా సినిమా కష్టాలను ఎదురుకుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ హీరోగా మారారు.
అంతే కాకుండా ఆయన ఎప్పుడూ కొత్త దర్శకులతో కలిసి పని చేయడానికి వెనుకాడరు. కెరీర్‌లో రవితేజ తొలి సినిమా చేసిన దర్శకులు ఆ పైన ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా ఎదిగారు.శీను వైట్ల, బోయపాటి శ్రీను వంటి దర్శకులకు తొలి సినిమా అవకాశం ఇచ్చింది రవితేజనే. ఆ తరువాత వారు ఎలాంటి స్థాయికి చేరుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక రవితేజ పరిచయం చేసిన ఇతర దర్శకులు యోగి ( ఒక రాజు ఒక రాణి), ఎస్ గోపాల్ రెడ్డి (నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్), హరీష్ శంకర్ (షాక్), గోపిచంద్ మలినేని ( డాన్ శీను), కే.ఎస్ రవీంద్ర/బాబీ (పవర్), విక్రమ్ సిరికొండ (టచ్ చేసి చూడు) ఉన్నారు.
వీరిలో హరీష్ శంకర్ మరియు బాబీ ప్రస్తుతం ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న దర్శకులు గా చలామణి అవుతున్నారు. కేవలం కొత్త దర్శకులే కాదు, ఒక సినిమా తీసి ఫ్లాపులతో ఉన్న దర్శకులను కూడా రవితేజ ప్రోత్సహించడంలో ముందుంటారు.
ఇక తాజాగా రవితేజ అలాంటి దర్శకుడితో చేసిన సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహించారు. రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా చేశారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఇందులో ఓ కీలక పాత్రను పోషించారు. కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిన ఈ చిత్రం జూలై 29న మంచి అంచనాల నడుమ విడుదలైంది.
అయితే రవితేజ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆ చిత్రం ఘోరమైన స్పందనను తెచ్చుకుంది. మాస్ మహరాజ్ నుంచి ఆశించే ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఏమాత్రం లేకపోవడంతో ప్రేక్షకులు చాలా నిరాశ చెందారు. అలాగని ఏదైనా కొత్తదనంతో ఆకట్టుకున్నారా అంటే అదీ లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం అనేది ఆసక్తికరమైనదే అయినా.. అటు థ్రిల్లర్ లా తీయకుండా ఇటు కమర్షియల్ సినిమాలా కాకుండా రెండిటికీ చెడిన రేవటిలా తయారయింది సినిమా.
మొత్తానికి తాను కష్టపడి పైకి వచ్చారన్న కారణంతో కొత్త దర్శకులు, లేదా ఫెయిల్యూర్ లో ఉన్న దర్శకులకు అవకాశాలు ఇచ్చే రవితేజకు ఆ నిర్ణయం వల్ల చాలా తక్కువ సార్లు మాత్రమే విజయాలు దక్కాయి. ఆయన దర్శకులపై పెట్టుకున్న నమ్మకాన్ని వారు నిలుపుకోలేక పోయారు.
ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ధమాకా చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు, ఈయన గత చిత్రాలు హిట్ సినిమాలే. అయితే రవితేజ నటిస్తున్న మిగతా రెండు చిత్రాలైన టైగర్ నాగేశ్వరరావు , రావణాసుర చిత్రాల దర్శకులు మాత్రం ప్రస్తుతం విజయాలు లేని వారే. మరి ఆ సినిమాలైనా హిట్ సాధించి రవితేజ నమ్మకాన్ని నిలబెడతాయి అని ఆశిద్దాం.