రణ్‌బీర్ కపూర్ మరియు అలియా భట్ ప్రధాన పాత్రల్లో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన “బ్రహ్మాస్త్ర” బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచే వైపు పరుగులు తీస్తుంది. ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్ లో అద్భుతమైన వసూళ్లను సాధించి ప్రపంచవ్యాప్తంగా 225 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
బాలీవుడ్ ట్రేడ్ పండితుల నివేదికల ప్రకారం బ్రహ్మాస్త్ర హిందీ వెర్షన్ తొలి దాదాపు రూ.120 కోట్లు రాబట్టింది. కాగా ఇదివరకు మొదటి వారాంతం అంటే డైరెక్ట్ హిందీ సినిమాల ఓపెనింగ్ వీకెండ్ రికార్డ్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన సంజూ సినిమా సాధించింది. దేశ వ్యాప్తంగా సంజు సినిమా120 కోట్ల నెట్‌తో రికార్డు సృష్టించగా.. ఇప్పుడు బ్రహ్మాస్త్ర 125 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. ఈ క్రమంలో రణ్‌బీర్ తన రికార్డును తానే బద్దలు కొట్టారన్నమాట. అంతే కాకుండా హిందీ చిత్రాలకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది బ్రహ్మస్త్ర.
ఇక తన చిత్రానికి లభించిన భారీ ఓపెనింగ్స్ చూసి దర్శకుడు అయాన్ ముఖర్జీ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కేవలం దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ చాలా రుణపడి ఉన్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మాస్త్ర సినిమాకి లభించిన ప్రేమ, ఆదరణ నిజంగా తమ చిత్ర బృందానికి ఉత్తేజకరమైన భావనతో పాటు భావోద్వేగానికి లోనయ్యేలా చేసిందని.. ఓపెనింగ్ వీకెండ్ కు భారీ స్థాయిలో స్పందన ఇచ్చి తమను ఆశీర్వాదించిన ప్రేక్షకులకు కృతజ్ఞుడిని చేసిందని, ఇక రాబోయే వారాల్లో కూడా ప్రేక్షకులు తమ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
బ్రహ్మాస్త్ర సినిమా విజయం బాలీవుడ్ పరిశ్రమకు ఎంతో అవసరమైనదిగా చెప్పవచ్చు. అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్ నటించిన లాల్ సింగ్ చద్దా, ఖిలాడి అక్షయ్ కుమార్ చేసిన రక్షా బంధన్, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్ మరియు రణబీర్ కపూర్ హీరోగా చేసి ఇటీవలే విడుదలైన షంషేరాతో సహా హిందీ చలనచిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం అనేక భారీ-బడ్జెట్ ఫ్లాప్‌లను చూసింది. పైగా లాల్ సింగ్ చద్దాతో సహా అనేక పెద్ద సినిమాలకి చాలా ఇబ్బంది కలిగించిన బాయ్కాట్ నినాదాల ప్రభావం గురించి కూడా చాలా చర్చ జరిగింది.
ఏది ఏమైనప్పటికీ, బ్రహ్మాస్త్ర అటువంటి బాయ్కాట్ ట్రెండ్ తో పాటు తొలిరోజు నెగటివ్ సమీక్షలను కూడా ఎదురుకుని బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో లాంగ్ రన్ ను కొనసాగిస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. కాగా విడుదలకు ముందే బ్రహ్మస్త్ర సినిమాకు దాదాపు లక్ష టిక్కెట్లు అమ్ముడవ్వడం విశేషం.