వెంకటేష్, రానా కలిసి తొలిసారి నటించిన రానా నాయుడు వెబ్ సీరీస్ యొక్క ట్రైలర్ తాజాగా విడుదల అయింది. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత దగ్గుబాటి అభిమానులు తమ ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ లో రానాతో వెంకటేష్ తలపడనున్నారు. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’కు రీమేక్ గా రానా నాయుడు తెరకెక్కింది. ఈ షో షూటింగ్ కొద్దిరోజుల క్రితమే పూర్తి కాగా, ఇప్పుడు అందరి దృష్టి నెట్ ఫ్లిక్స్ ప్రీమియర్ పైనే పడింది.
కరణ్ అన్షుమన్ రూపొందించిన ఈ సిరీస్ లో రానా తండ్రి నాగ పాత్రలో వెంకటేష్ నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో షోలు ఇన్సైడ్ ఎడ్జ్, మీర్జాపూర్లను రూపొందించడంలో ఆయనకు చక్కని పేరుంది. సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్ కూడా రాణా నాయుడులో ముఖ్య పాత్రల్లో నటించారు.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ నాగ పాత్రను పోషించడం తనకు పూర్తిగా కొత్త అనుభవం అని అన్నారు. ఎందుకంటే ఇలాంటి పాత్రను తను ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదని, రానా పాత్రలో ఉన్న ఇంటెన్స్ పర్సనాలిటీకి పూర్తి భిన్నంగా తన పాత్ర కాస్త సరదా ప్రవర్తనతో ఉండటం ఆ పాత్రలో నటించడం ఒక రిఫ్రెషింగ్ ఛేంజ్ అని వెంకటేష్ తెలిపారు.
ఇక వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని, రానా నాయుడు పాత్రలో నటించడం చాలా ఛాలెంజింగ్ గా అనిపించిందని రానా అన్నారు. ఆ పాత్ర తన కుటుంబంతో లోతైన భావోద్వేగ సంబంధం ఉన్న సంక్లిష్టమైనది అయినా, అతని తండ్రితో మాత్రం సరైన సంబంధం లేనందువల్ల పోరాడే పాత్ర అని ఆయన తెలిపారు.