తెలుగు సినీ పరిశ్రమ లోకి ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా అడుగు పెట్టారు రామ్ పోతినేని. నటనతో పాటు డాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ తనదైన శైలిలో ప్రతిభను చూపిస్తూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఆ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’తో కమ్ బ్యాక్ హిట్ ఇచ్చి మళ్ళీ రేసులోకి వచ్చేశారు. ఆ వెంటనే ‘రెడ్’ అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు.
తాజాగా, ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామితో ‘ ది వారియర్’ సినిమా చేశారు రామ్. ఆ సినిమా జులై 14న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా.. యువ నటుడు ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించారు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయింది. తొలి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ రోజు మినహా బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రభావం చూపించలేక పోయింది.
రామ్ నటన బాగుంది అనిపించినా, మూస కథ మరియు పసలేని కథనం ది వారియర్ పెద్ద మైనస్‌గా మారాయి. ఒక చక్కని మాస్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు సినిమాలో ఉన్నా, అన్నిటినీ సరిగ్గా ఒక పద్ధతిలో పొందు పరచడంలో దర్శకుడు లింగుసామీ విఫలం అయ్యారు. మాస్ సినిమాలకు ఉండాల్సిన పకడ్బందీ కథనం లేకపోగా, సరైన వేగం లేకుండా సీన్ లు అన్నీ అలా సాదాసీదాగా రావడం ప్రేక్షకులకు రుచించలేదు.
ఇక ఈ క్రమంలో సినిమా విడుదలై నెల రోజులైనా గడవక ముందే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ మేరకు హాట్ స్టార్ సంస్థ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రేక్షకులకి తెలియజేసింది. హి ఈజ్ రెడీ అంటూ ట్వీట్ చేసింది.
ది వారియర్ సినిమా తరువాత హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం తన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది.