మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారనీ, వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని మొదటి నుంచి గట్టి ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాకి ఇప్పటివరకూ ‘విశ్వంభర’, ‘సర్కారోడు’ అని పలు టైటిల్స్ వినిపించినా, చిత్ర యూనిట్ ఏదీ అధికారికంగా ఖరారు చేయలేదు.ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా 30 మార్చి 2023 (శ్రీరామ నవమి) రోజున రిలీజ్ కానుందని తెలుస్తోంది. వేసవి కాలంలో మొదటి సినిమాగా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాకి లాభం చేకూరుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
అక్టోబర్ లాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రొడక్షన్ పనులు ప్రారంభం చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ కెరీర్ లో పెద్ద హిట్స్ గా నిలిచిన రంగస్దలం, ఆర్ ఆర్ ఆర్ కూడా మార్చి నెల చివరి వారంలో రిలీజ్ అవటం వల్ల ఇప్పుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా అదే సమయంలో విడుదల చెస్తే సెంటిమెంట్ గా వర్కవుట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారని వినికిడి.
ప్రస్తుతం పంజాబ్ లో రామ్ చరణ్, కియారాల పై దాదాపు వెయ్యి మంది డ్యాన్సర్స్‌తో సాంగ్ షూట్ జరుగుతోంది. గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ పాట ఇక్కడితోనే పూర్తవదనీ, దీనికి కొనసాగింపు హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో కూడా జరుగుతుందని తెలిసింది. ఇక వీలయినంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సినిమాని వచ్చే వేసవిలో విడుదల చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు తెలుస్తుంది.
శంకర్ ఈ చిత్రంతో పాటు కమల్ హాసన్ తో ఇండియన్ – 2 కు కమిట్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆ సినిమా షూటింగ్ ఆపివేయడం జరిగింది. అయితే ఇటీవలే విక్రమ్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కమల్ హాసన్.. ఇండియన్ -2 ను మళ్ళీ సెట్స్ పైకి తేవడానికి ఉత్సుకతతో ఉన్నట్లు, అందుకు దర్షకుడు శంకర్ కూడా సమ్మతించినట్లు తెలుస్తుంది.