గత కొన్నేళ్లుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు చేయడం తప్ప ఇతరత్రా వ్యవహారాల్లో మౌనం పాటిస్తున్నారు. ఎలాంటి వివాదాలలో కానీ అనవసర విషయాల్లో కానీ ఆయన ఈమధ్య అసలు జోక్యం చేసుకోలేదు. అయితే తాజాగా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి పై బురదజల్లేందుకు ప్రయత్నించిన రాజకీయ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు.
చరణ్ మాట్లాడుతూ తాను వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ కు నేను ఒక హీరోగానో లేక మరోలానో రాలేదు. మీలో ఒక్కడిగా వచ్చాను అని మెగా అభిమానులతో రామ్ చరణ్ అన్నారు. ఇక తన ప్రసంగం చివరిలో చరణ్ సైలెంట్ గా ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది.
చిరంజీవి గారు సైలెంట్ గా ఉండే మనిషి అని చెప్పిన రామ్ చరణ్, ఆయన అంత నిశ్శబ్దంగా ఉంటేనే ఈ రోజు వేలాది మంది అభిమానులు వచ్చారు. అదే ఆయన కొంచెం దూకుడుగా ఉంటే ఏం జరుగుతుందో ఊహించండి అని అన్నారు. అంతే కాకుండా చిరంజీవి నిశ్శబ్దంగా ఉన్నా లేదా దూకుడుగా ఉన్నా.. మేం నిశ్శబ్దంగా ఉండం. మేం అస్సలు (అభిమానులు) నిశ్శబ్దంగా ఉండము! అని నేను మీకు నిశ్శబ్దంగానే చెబుతున్నాను అని అంటూ చరణ్ చాలా భావోద్వేగానికి లోనయ్యారు.
రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల మెగా ఫ్యామిలీ పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన నటి, రాజకీయ నాయకురాలు రోజాను ఉద్దేశించే చేసినవి అని గట్టిగా వినిపిస్తోంది.
ఇక అంతకు ముందు చిరంజీవిగారిని వాల్తేరు వీరయ్య సినిమాలో అద్భుతంగా చూపించిన దర్శకుడు బాబీకి ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్.. సినిమాలో చిరంజీవి అన్నలాగా కనిపిస్తున్నారు కానీ నాన్నలా కాదని ఆయన ప్రశంసలు కురిపించారు. చరణ్ స్పీచ్ ఆద్యంతం మెగా ఫ్యాన్స్ హంగామా భారీ స్థాయిలో కొనసాగింది. చాలా రోజుల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి ఇలాంటి ఆవేశపూరితమైన స్పీచ్ విన్న అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది.