రామ్ చరణ్ ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో దిగ్గజాలలో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ అందరి చూపు రామ్ చరణ్ తదుపరి చిత్రం పైనే ఉంది. మెగా పవర్ స్టార్ తన తదుపరి చిత్రాన్ని యువ దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
2023 జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. తారాగణం మరియు సాంకేతిక నిపుణులను చిత్ర బృందం త్వరలోనే ప్రకటిస్తారట. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని నూతన నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా చేయనున్నారనే వార్త ప్రస్తుతం సినీ ప్రియుల చర్చలలో ఎక్కువగా పాకింది.
ఏకంగా 300 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో నిర్మించబోతున్న ఈ సినిమాని గ్రామీణ ప్రాంత నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
దక్షిణాది సినిమాల్లో తాజా ట్రెండ్ ను గమనిస్తే, గ్రామీణ నేపథ్యంలో రూపొందిన సినిమాలు ఎక్కువగా విజయాలు సాధిస్తున్నాయి. ఉదాహరణకు కాంతార లాంటి సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా భారీ విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఒక సినిమాని ఎంత ప్రాంతీయతను మేళవించి తెరకెక్కిస్తే అవి మరింత యూనివర్సల్ అవుతాయి అనే సామెత ఇప్పుడు నిజం అవుతుంది.
ఈ చిత్రం రామ్ చరణ్ దగ్గరకి ఎలా వచ్చిందనే దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించగా వారిద్దరూ ముందుకు సాగడానికి అంగీకరించారు.
అయితే వివిధ కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత దర్శకుడు రామ్ చరణ్ ను సంప్రదించగా స్క్రిప్ట్ నచ్చడంతో ఓకే చెప్పారట. ఈ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ కోస్తాంధ్రప్రదేశ్ లో జరగనుంది.