దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో మగధీర, తాజా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలను రాజమౌళి అందించారు.
ఆ విధంగా రాజమౌళి, రామ్ చరణ్ ల మధ్య స్నేహం మగధీర సినిమాతో మొదలైంది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచమంతా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తోంది అంటే.. దానికి కారణం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, చరణ్ ల అరుదైన కలయికలో వచ్చిన ఈ మల్టీస్టారర్ చిత్రం ఆస్కార్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుందా లేదా అని భారతీయ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ ఆశలతో పాటు ఆర్ ఆర్ ఆర్ అనేక అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది. రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ ను మహేష్ బాబుతో చేయబోతున్నట్లు ఇప్పటికే మనం తెలుసుకున్నాము.
ప్రముఖ సినీ విశ్లేషకురాలు అనుపమ చోప్రా ఫిల్మ్ కంపానియన్ తరపున నిర్వహించిన ఫిల్మ్ మేకర్స్ అడ్డా ఈ రోజు రాజమౌళి పాల్గొన్నారు. రాజమౌళితో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, కమల్ హాసన్, గౌతమ్ మీనన్, స్వప్న దత్, లోకేష్ కనగరాజ్ ఈ చర్చలో పాల్గొన్నారు.
2023లో సుకుమార్, చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని రాజమౌళి తెలిపారు. చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాజమౌళి తెలిపారు.
కాగా ఇదివరకే ఈ సినిమా ఓపెనింగ్ సీన్ చరణ్ తనకు వినిపించారని ఆయన చెప్పారు. తాజాగా అదే సన్నివేశం గురించి చెప్తూ త్వరలోనే వీరిద్దరి కలయికలో సినిమా తీస్తారని ఎదురుచూస్తున్నానని రాజమౌళి అన్నారు.
2018లో రంగస్థలం సినిమా కోసం సుకుమార్- చరణ్ కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ గ్రామీణ పాత్రలో కనిపించారు. రంగస్థలం భారీ గుర్తింపుతో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లను కూడా అందుకుంది. మరి సుకుమార్, రామ్ చరణ్ రంగస్థలం సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా లేక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారా అనేది వేచి చూడాలి.