ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా పుష్ప ది రైజ్ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు దేశం మొత్తం దాసోహం అయిపోయింది. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ మరియు మ్యానరిజం సంచలనం సృష్టించింది.
ఈ చిత్రం విడుదలై దాదాపు సంవత్సరం పూర్తి కావస్తున్నా.. ప్రేక్షకులలో ఈ సినిమాకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా పుష్ప సినిమా ఏదో రకంగా వైరల్ అవుతూనే ఉంది. ముందుగానే చెప్పుకున్నట్లు తగ్గేదేలే వంటి డైలాగులు మరియు సామీ సామీ, ఊ అంటావా మామా పాటలు ఇన్స్టా రీల్స్ ద్వారా నిరంతరం ప్రచారంలో ఉంటున్నాయి.
తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇటీవల ఈ చిత్రాన్ని మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బాస్టర్ హిట్లుగా నిలిచిన చిత్రాల కేటగిరిలో పుష్ప తెలుగు వర్షన్ సినిమాను ఇంగ్లిష్, రష్యన్ సబ్ టైటిల్స్‌తో ప్రదర్శించడం విశేషం.
అంతే కాకుండా తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం త్వరలోనే పుష్ప ది రైజ్ చిత్రం తాలూకు రష్యన్ డబ్బింగ్ వర్షన్‌ను కూడా విడుదల చేయనున్నారట. పుష్ప చిత్ర బృందం అందుకు తగిన సన్నాహాలు చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పుష్ప ది రూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మొదటి భాగం అనూహ్యంగా భారీ విజయం సాధించడంతో దర్శకుడు సుకుమార్ సీక్వెల్ పై చాలా జాగర్తలు తీసుకుని.. స్క్రిప్ట్ వర్క్ తో మొదలు పెట్టి అన్ని అంశాలూ తనకి అనుగుణంగా ఉండేలా దృష్టి సారించారు. బడ్జెట్, క్యాస్టింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో ఈ అత్యంత క్రేజీ సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు.
వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా పై ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు మరియు ట్రేడ్ వర్గాలు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాయి. మరి అందరి అంచనాలను గనక ఈ సీక్వెల్ అందుకుంటే మరెన్ని సంచనాలను సృష్టిస్తుందో చూడాలి.