నటుడు సునీల్ ప్రస్తుతం కెరీర్ బెస్ట్ స్టేజ్ లో ఉన్నారు. కోలీవుడ్ నుంచి సునీల్ కు వైవిధ్యభరితమైన పాత్రలు వస్తున్నాయి. అయితే అందుకి పుష్ప సినిమా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సునీల్ భారీ తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు అందుకుంటున్నారు. పుష్పలో ఆయన నటనే ఈ అవకాశాలకు ఆయన అర్హులయ్యేలా చేసింది.
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో సునీల్ టాప్ కమెడియన్లలో ఒకరిగా వెలుగొందారు. 2010 వరకు దాదాపు ప్రతి తెలుగు సినిమాలోనూ ఆయన కనిపించారు. కమెడియన్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేశారు.
అయితే సునీల్ హీరోగా తొలిదశలో కొన్ని హిట్స్ అందుకున్నా ఆ తర్వాత వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు అందించడంలో విఫలమయ్యారు. తన కామెడీ టైమింగ్ ను కోల్పోయారని, కమెడియన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా కూడా రాణించలేక కనుమరుగవుతారని చాలా మంది అనుకున్నారు.
కానీ ‘కలర్ ఫోటో’, ‘పుష్ప’ వంటి సినిమాల్లో విలన్ గా నటించిన సునీల్.. తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. నిజానికి అలాంటి ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో ఆయన అంత బాగా నటిస్తారని ఎవరూ ఊహించలేదు.
తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ సినిమాలో సునీల్ నటించనున్నారని ప్రకటించారు. అలాగే శివ కార్తికేయన్ ‘మావీరన్’లో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ రెండింటితో పాటు కార్తీ నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రం ‘జపాన్’లో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
అంతే కాకుండా మరో తమిళ హీరో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మార్క్ ఆంథోని’ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో విశాల్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరో ప్రముఖ నటుడు/దర్శకుడు ఎస్.జె.సూర్య కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారని సమాచారం.