పూరి జగన్నాధ్ కెరీర్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అలాగే ఆయన తనయుడు ఆకాష్ పూరి కూడా హీరోగా నిలదొక్కుకోవాలని చాలా కష్ట పడుతున్నారు. మొత్తంగా ఇద్దరూ కూడా ప్రస్తుతం కెరీర్‌లో చాలా దిగువ దశలో ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద లైగర్ సినిమా ఘోరమైన ప్రదర్శన తర్వాత, పూరీతో పనిచేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. విజయ్ దేవరకొండ కూడా పూరీతో చేయాల్సిన జనగణమన అనే సినిమాని రద్దు చేసుకున్నారు.
ఇక పూరి తనయుడు ఆకాష్ కూడా ఇండస్ట్రీలో నటుడిగా హీరోగా, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఆకాష్ పూరి హీరోగా చేసిన మెహబూబా, రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమై భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. మెహబూబా సినిమాకి పూరి రచన మరియు దర్శకత్వం వహించగా, రొమాంటిక్ సినిమాకు మాత్రం పూరి కథను అందించగా.. అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు.
ప్రస్తుతం పూరీ, ఆకాష్‌ల సమస్య ఏమిటంటే, ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా సినిమాలను తీయలేకపోవడమే అని చెప్పాలి. ముఖ్యంగా పూరి సినిమాలను ఎంచుకునే విషయంలో పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు. అవే మాఫియా బ్యాక్ డ్రాప్ కథలు, తెంపరితనంతో ఉండే హీరో, అమ్మాయిలను వస్తువుల్లా చూపించే తత్వం ఇలా ఒక మూస ధోరణి మరియు నాసిరకం ప్రమాణాలతో తెరకెక్కిస్తున్న సినిమాల వల్ల వారి సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొత్త తరహా సినిమాలకు అలవాటు పడుతుంటే, పూరి – ఆకాష్ పూరి మాత్రం ఇంకా గతంలోనే ఇరుక్కుపోయారు.
కాస్త బాధ కలిగించే విషయం అయినా, పూరితో పనిచేయడానికి ప్రస్తుతం ఎవరూ ఇష్టపడటం లేదనేది నిజం. తనతో కలిసి పని చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో, చేసేది లేక పూరి తదుపరి చిత్రాన్ని తన కొడుకుతో చేయాలని నిర్ణయించుకున్నారు. పూరి తనతో పాటు ఆయన కొడుకు ఆకాష్ కూడా గట్టిగా కమ్‌బ్యాక్ ఇచ్చేలా సినిమాను ప్లాన్ చేస్తున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.
పూరి జగన్నాథ్ గురించి అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీలో ఉన్న అభిప్రాయం ఏంటంటే, పరాజయాల వచ్చినపుడు ఆగిపోకుండా మళ్ళీ తిరిగి పుంజుకొవాలనే ప్రయత్నిస్తారు. కెరీర్ లోనే ఎన్నడూ లేనంత హీన స్థితిలో ఉన్న పూరి సరైన సమయం వెచ్చించి పటిష్టమైన స్క్రిప్ట్‌ని రూపొందించి, తిరిగి బ్లాక్‌బస్టర్ సినిమాతో తనదైన శైలిలో మన ముందుకు వస్తారని ఆశిద్దాం.