తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. కేవలం సినిమాలు నిర్మించడం కాకుండా పరిశ్రమకు చెందిన కొన్ని కీలక నిర్ణయాలు అమలు పరచడంలో ఆయన పాత్ర ఉంటుందన్న మాట వాస్తవం. ఎందుకంటే అంతగా ఆయన పరిశ్రమ వర్గాలను ప్రభావితం చేసే స్థానంలో ఉన్నారు. కానీ గత కొన్ని రోజులుగా దిల్ రాజు చుట్టూ సమస్యలు ఏర్పడుతున్నాయి. అయన బ్యానర్ లో వచ్చిన సొంత సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో దిల్ రాజు ప్రస్తుతం ఆయన కెరీర్ లోనే అత్యంత దారుణమైన దశలో ఉన్నారు.
అయితే తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని దానికి సరైన పరిష్కారం కనుక్కోకుండా.. దిల్ రాజు తన నష్టాలకు అకారణంగా ఇతరులని నిందిస్తూ నిజాన్ని ఒప్పుకోలేక ఏవేవో సాకులను వెతుకుతున్నారు. ఒకసారి ఏమో ప్రేక్షకులు సినిమాకానీ అర్థం చేసుకోలేక పోతున్నారని, మరోసారి నటీనటులు, దర్శకుల రెమ్యూనరేషన్ లు పెంచేయడం వల్ల సినీ నిర్మాణం కష్టతరం అవుతుందని, ఓటిటిల వల్ల సినిమాలు తీయడం సమస్యగా మారుతుందని ఇలా రకరకాల కారణాలను ఆయన సినిమాల వైఫల్యానికి కారణంగా చూపిస్తూ వచ్చారు.
అయితే ఇక్కడ దిల్ రాజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయన సినిమాలు పరాజయం పొందింది మరేవో కారణాల వల్ల కాదు.. పేలవమైన కంటెంట్..ప్రేక్షకులను ఆకట్టకోలేని ప్రచార కార్యక్రమాల కారణంగానే ఆయా చిత్రాలు పరాజయం పొందాయి.
ఇటీవల విడుదలైన థాంక్యూ, బింబిసార మరియు సీతా రామం సినిమాల ఫలితాలను చూస్తే మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తే ప్రేక్షకులే ఆ సినిమాలను గెలిపిస్తారని చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. థాంక్యూ సినిమా సరైన కథ, మరియు ఆకట్టుకునే కథనం లేని కారణంగా విఫలం అవగా, చక్కని కథతో పాటు ఆకట్టుకునే కథనం మరియు అదనపు హంగులు ఉన్న కారణంగా బింబిసార మరియు సీతా రామం సినిమాలు విజయం సాధించాయి.
ఇక ఇటీవలే నిఖిల్ సినిమా కార్తికేయ 2 విడుదల తేదీ విషయంలో జరిగిన వివాదాలలో దిల్ రాజు కావాలనే కార్తీకేయ 2 చిత్రాన్ని టార్గెట్ చేశారని ప్రేక్షకులు భావించారు, మొదట థాంక్యూ సినిమా కోసం కార్టికేయ 2 విడుదల తేదీని వాయిదా వేయించారు. తర్వాత ఆ సినిమా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వచ్చినా కూడా తగినన్ని థియేటర్లను కేటాయించలేదు. ఇప్పుడు విడుదల తర్వాత ఆ సినిమాకు వచ్చిన విశేషమైన స్పందన చూసిన తరువాత కూడా సినిమాకు అవసరమైన మేరకు షోలు కేటాయించడం లేదు. ఈ వ్యవహారం అంతా చూసిన పలు ఇండస్ట్రీ వర్గాలు మరియు ప్రేక్షకులు నిఖిల్‌ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు అంటూ దిల్ రాజుపై సోషల్ మీడియాలో వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.