పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలకు హరీష్ శంకర్, సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు సినిమాల షూటింగులలో పాల్గొంటున్నారు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం నిజమైతే పవన్ కళ్యాణ్ ఓజీలో తమిళ నటి ప్రియాంక అరుళ్ మోహన్ మెయిన్ హీరోయిన్ గా నటించనున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఓజీ నిర్మాతలు మాళవిక మోహనన్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు కానీ చివరకు ప్రియాంక మోహన్ ఆ ఛాన్స్ దక్కించుకున్నారని, ఆమె ఈ సినిమాలో నటించడం దాదాపు ఫైనల్ అయిందని, ఈ నెలాఖరులో పవన్ కళ్యాణ్ తో కలిసి సెట్స్ లో జాయిన్ అవుతారని అంటున్నారు.
తెలుగులో ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్రీకారం’ వంటి చిత్రాల్లో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఓ పెద్ద హీరోతో నటించడం ఇదే తొలిసారి. ప్రియాంక, పవన్ కళ్యాణ్ ల జోడీ ఖచ్చితంగా చాలా కొత్తగా ఉంటుంది. ప్రియాంక అరుళ్ మోహన్ ఓజీలో జాయిన్ అవుతారని నిర్మాతలు త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో అద్భుతమైన తారాగణం, చిత్ర బృందం ఉంటుందని, వారి వివరాలను రాబోయే రోజుల్లో ప్రకటిస్తారని తెలియవస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వర్ధమాన దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రమిది.
పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. వరుస షెడ్యూల్స్ నిర్వహించి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సహా 6 నెలల్లో సినిమా పనులను పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.