గత సంవత్సరం విడుదలైన ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ లో ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ పై ట్రోల్స్ రావడంతో నిర్మాతలు ఆందోళనకు గురయ్యారు. దాంతో మళ్ళీ సినిమా పై రివర్క్ చేసి మాంచి విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో సినిమా విడుదల తేదీని కూడా దాదాపు 6 నెలలు వాయిదా వేశారు.
ఇక తాజాగా 2023 జూన్ 13న న్యూయార్క లో జరిగే ట్రిబెకా ఫెస్టివల్లో ఆదిపురుష్ వరల్డ్ ప్రీమియర్ కానుందని ఇటీవల ప్రకటించారు. ఈ విషయాన్ని ఆ ఫిల్మ్ ఫెస్టివల్ అధికారిక ట్విటర్ పేజ్ ద్వారా షేర్ చేయగా, వారు ఈ చిత్రాన్ని తమ లైనప్ లో నమోదు చేశారు.
ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ ఈ ఏడాది తమ ఫెస్టివల్ లో ప్రదర్శించబడుతున్న చిత్రాల మాంటేజ్ ను తమ సోషల్ మీడియాలో ఖాతాలో ఒక వీడియో ద్వారా పంచుకుంది. ఈ వీడియోలో ఆదిపురుష్ లోని కొన్ని సెకన్లు కూడా ఉన్నాయి. కాగా టీజర్ లో కొత్త విజువల్స్ పాత విజువల్స్ కంటే చాలా బాగున్నాయని, ఈ టీజర్ ఆశాజనకంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.
ఆదిపురుష్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సినిమా వీఎఫ్ఎక్స్ లో స్వల్ప మార్పు కనిపించింది. ఈ మార్పు పై స్పందించిన కొందరు సోషల్ మీడియా యూజర్లు ఈ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడగా, కొన్ని వర్గాల నెటిజన్లు మాత్రం ఈ మార్పులు అసాధారణమైనవి కావని, కేవలం కలర్ గ్రేడింగ్ మాత్రమే మార్చారని అభిప్రాయ పడ్డారు.
ఆదిపురుష్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జూన్ 16న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. టి-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్ ప్రొడక్షన్స్ పతాకాల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
174 నిమిషాల నిడివి (2 గంటల 54 నిమిషాలు) కలిగిన ఈ సినిమాకి తాన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ పౌరాణిక డ్రామాకు దర్శకుడు. లైవ్ యాక్షన్ 3డిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, జానకి పాత్రలో కృతి సనన్, లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్నారు.