సాహో, రాధే శ్యామ్ వంటి వరుస పరాజయాల తరవాత కూడా ప్రభాస్ ఇప్పటికీ అత్యంత డిమాండ్ ఉన్న భారతీయ నటులలో ఒకరుగా చలామణి అవుతున్నారు. కాగా రాబోయే సంవత్సరాల్లో నాలుగు భారీ ప్యాన్ ఇండియా చిత్రాలలో ప్రభాస్ నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలార్, రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్, నాగ్ అశ్విన్ తీస్తున్న ప్రాజెక్ట్ కే మరియు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న స్పిరిట్‌లో ప్రభాస్ పాల్గొంటారు.
ఈ సినిమాలన్నింటిలో విడుదలకు దగ్గరలో ఉన్న ఏకైక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన సీజీఐ, వీఎఫ్‌ఎక్స్ వర్క్ పై చిత్ర నిర్మాతలు భారీగా పెట్టుబడి పెడుతున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ని దృష్టిలో ఉంచుకుని సినిమా మొత్తాన్ని ప్రత్యేకంగా గ్రీన్ మ్యాట్ పై చిత్రీకరించారు.
భారతదేశంలో సినిమా పరిశ్రమ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పటికీ, వీఎఫ్‌ఎక్స్ అనేది ఇప్పటికీ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనేది తెలిసిందే. అలాంటి గ్రాఫిక్స్ అంశాలకు అధిక ప్రాధాన్యం ఉన్నందున, ప్రస్తుతం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంగా ఆదిపురుషం నిలుస్తుంది. అయితే చాలా రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త కానీ ప్రచార కార్యక్రమాల ఊసు గానీ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ చిత్ర బృందం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ రాకపోతుందా అని ప్రభాస్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తామని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించారు కానీ దానికి సంబంధించిన అప్‌డేట్‌లు మాత్రం అసలు రానే లేదు. ఒక పాట లేదా టీజర్, ట్రెయిలర్ ఇలా ఈ సినిమా నుండి ఏ రకమైన ప్రమోషనల్ కంటెంట్ కూడా విడుదల కాలేదు.
కనీసం ఇప్పటి వరకూ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు ఆదిపురుష్ టీమ్. దీంతో ప్రభాస్ అభిమానుల తీవ్ర అసహనానికి గురవుతున్నారు. వారి బాధలోనూ న్యాయం ఉంది. సినిమా రిలీజ్ కు ఇంకా మూడు నెలలే ఉన్న సమయంలో కూడా ఎలాంటి అప్డేట్ లేకుండా ఉండటంతో ప్రభాస్ అభిమానులు అసలు చెప్పిన డేట్ కి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న భయంతో ఉన్నారు.