పోస్ట్ ప్రో అనేది ఒక పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ. ఈ కంపెనీని వసంత్ స్థాపించారు. పోస్ట్ ప్రో కంపెనీ ద్వారానే కార్తికేయ 2 చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ మరియు అన్ని భాషల్లోకి డబ్బింగ్ జరుపుకుంది. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో అనువదించే సమయంలో నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అన్ని భాషల అనువాదాల పనులు కూడా ఒకేసారి హైదరాబాద్ లో జరిగెందుకు వీలుగా పోస్ట్ ప్రో కంపెనీ ఏర్పాటు చేయబడింది.
ఈ సందర్భంగా కార్తీకేయ 2 చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా ఇతర భాషల్లో ఉన్న డబ్బింగ్ కళాకారులతో పాటు రచయితలను కూడా హైదరాబాద్ కు రప్పించి, నిర్మాతల సౌలభ్యం కోసం కార్తికేయ 2 సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పోస్ట్ ప్రో పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ హైదరాబాద్ లో పూర్తి చేయడం జరిగింది. కార్తికేయ 2 చిత్రానికి హైదరాబాద్ లోనే డబ్బింగ్ పనులు పూర్తి చేయడం ద్వారా మాకు బడ్జెట్ కంట్రోల్ లో ఉండడమే కాకుండా.. దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమా అనువాద కార్యక్రమాలను రోజూ చూసుకొని అవసరమైన మార్పులు చేసుకోనే అవకాశం లభించింది. దాంతో పాటు చాలా సమయం ఆదా అయ్యింది అని కూడా అన్నారు. సినిమా విడుదల చివరి వరకు తమతోనే ఉండి అన్ని రకాలుగా వెన్నుదన్నుగా నిలిచి సహకరించిన పోస్ట్ ప్రో డబ్బింగ్ కంపెనీ వసంత్ గారికి కార్తీకేయ చిత్ర నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు.
కార్తికేయ 2 సినిమాను ఇతర భాషల్లో అనువదించే అవకాశాన్ని ఎంతో నమ్మకంతో పోస్ట్ ప్రో కంపెనీకి అప్పగించిన నిర్మాతలు టీ. జి. విశ్వ ప్రసాద్ గారికి, వివేక్ కుచిబొట్ల గారికి అభిషేక్ అగర్వాల్ గారికి, దర్శకులు చెందు మొండేటి గారికి హీరో నిఖిల్ సిద్ధార్థ్ మొదలగు వారందరికీ పోస్ట్ ప్రో కంపెనీ అధినేత వసంత్ గారు కృతజ్ఞతలు తెలిపారు. కార్తికేయ 2 సినిమానే కాకుండా.. ప్రస్తుతం పోస్ట్ ప్రో కంపెనీ పలు భారీ సినిమాలను కూడా అనువదించే పనిలో ఉందని తెలుస్తోంది.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కార్తీకేయ 2 చిత్రం విశేష స్థాయిలో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించారు. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక కీలక అతిథి పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైంది.