సినీ ప్రేమికులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా సినిమా పొన్నియిన్ సెల్వన్. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. పొన్నియిన్ సెల్వన్-1 సెప్టెంబర్ 30న అంటే నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా టికెట్స్ బుకింగ్ అన్ని చోట్లా అద్భుతంగా ఉండగా ప్రీమియర్ షోల నుండి స్పందన ఎలా ఉందో చూద్దాం.
అంతా ఊహించినట్టుగానే పోన్నియిన్ సెల్వన్ చిత్రానికి తమిళ ప్రేక్షకుల నుండి అద్భుతమైన టాక్ వచ్చింది. అక్కడ పొన్నియిన్ సెల్వన్ నవల అనేది ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధి గాంచింది. ఆ నవల మీద సినిమా అనగానే వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు వచ్చారు. పైగా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కడంతో తమిళ నాట ఈ సినిమాని అక్కున చేర్చుకున్నారు. అందుకే అక్కడి విమర్శకులు, మరియు సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి ఈ సినిమాకి చాలా మంచి స్పందన వస్తోంది. అక్కడ ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద భారీ రికార్డులు సృష్టించే అవకాశాలు చాలానే ఉన్నాయి.
ఇక తెలుగు ప్రేక్షకుల నుండి మాత్రం కాస్త మిశ్రమ స్పందన వస్తోంది. ఎందుకంటే బేసిక్ గా ఈ చిత్రం తమిళ రాజుల నేపథ్యంలో రూపొందినది కావడంతో అక్కడి ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. మన తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రం సినిమా కాస్త నిదానంగా సాగుతుంది అనే టాక్ వస్తుంది. మరి ఈ టాక్ ఇతర రెగ్యులర్ షోల తర్వాత మారుతుందో లేదో చూడాలి.
బాక్సాఫీస్ వద్ద ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని అంటున్నారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కిన ఈ ప్రాజెక్టులో విక్రమ్, కార్తీ, జయం రవి, శరత్‌కుమార్, జయరామ్, విక్రమ్ ప్రభు, పార్థీబన్, ప్రకాశ్ రాజ్, అరవింద్ స్వామి, ఐశ్వర్యా రాయ్, త్రిష, శోభితా ధూళిపాళ, కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు అద్బుతమైన స్పందన వచ్చింది.