పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళ చిత్రం వినోదయ సీతం రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సమ్మర్ లోనే శరవేగంగా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఆ రకంగా అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా ఇది పవన్ కళ్యాణ్ తదుపరి థియేట్రికల్ విడుదలగా ఉండనుంది.
తమిళంలో మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ తమిళ చిత్రం 2021 లో నేరుగా ఓటీటీలో విడుదలై విమర్శకుల నుండి ప్రశంసలు మరియు ప్రేక్షకుల నుండి ప్రేమను అందుకుంది. ఈ సినిమా చూశాక పవర్ స్టార్ తెలుగులో చేయడానికి ఆసక్తి చూపారు.
ఇక ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పటి నుండి స్టార్ కాస్ట్ గురించి అనేక రకాల నివేదికలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ సినిమాలోని ప్రధాన తారాగణాన్ని ప్రకటించడం ద్వారా నిర్మాతలు ఆ ఊహాగానాలకు తెరదించారు. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కేతిక శర్మలతో పాటు బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాశ్ వారియర్, రాజా చెంబోలు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించనుండటంతో పాటు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఒరిజినల్ లో పలు మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ ల సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తోంది. 2015లో వచ్చిన గోపాల గోపాల సినిమా తర్వాత పవర్ స్టార్ రెండోసారి ‘దేవుడు’ పాత్రలో నటిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత తన కుటుంబంలో పరిష్కరించడానికి అనేక సమస్యలు ఉన్నందున మరో 90 రోజులు జీవించాలని కోరే ఒక అహంకారి (సాయి ధరమ్ తేజ్) జీవితాన్ని ఈ చిత్రం అనుసరిస్తుంది. అతను తన జీవితాన్ని ఎలా మార్చుకుంటాడు మరియు మరింత మంచి మనిషిగా, అందరూ ఇష్టపడే వ్యక్తిగా ఎలా మారతాడు అనేది మిగిలిన కథ. సెప్టెంబర్ లో విడుదల కానున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సమయదేవుడు (God Of Time) కనిపించనున్నారు.