పవర్ స్టార్ అభిమానులకు పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్(2012) సినిమా భారీ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పండగ లాంటి సినిమాగా నిలిచింది. పవన్ కెరీర్ లో సరైన హిట్స్ లేని సమయంలో వచ్చిన ఈ సినిమా గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది.
అప్పటి నుండి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుండో పవన్ కళ్యాణ్- హరీష్ కాంబోలో మళ్ళీ ఒక సినిమా రావాలని కోరుకుంటున్నారు. వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తూ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నట్లు, సెప్టెంబర్ 2021లో ఒక చిత్రం ప్రకటించబడింది.
కాగా ఈ చిత్రానికి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఈ సినిమా గబ్బర్ సింగ్ కంటే భారీ స్థాయిలో ఉంటుందని దర్శకుడు హరీష్ శంకర్ చాలా సందర్భాలలో చెప్పి అభిమానుల్లో అంచనాలను పెంచేశారు. ఈ సారి కేవలం వినోదం మాత్రమే కాదు అనే క్యాప్షన్‌ని ఈ చిత్రానికి పెట్టారు.
ఇక సినిమా సెట్స్ మీదకి వెళ్ళడం ఆలస్యమవుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులను హరీష్ ఉత్సాహపరుస్తూనే ఉన్నారు. ట్విట్టర్‌లో అవకాశం దొరికినప్పుడల్లా సినిమా డైలాగులు మరియు సన్నివేశాలకు సంబంధించి పలు ట్వీట్లు కూడా చేశారు.
హరీష్ శంకర్ తన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ను తన మునుపటి స్టైల్ మరియు స్వాగ్ తో వెండి తెర పై చూపిస్తానని ప్రతిజ్ఞ చేయడంతో సినిమా పై పవన్ అభిమానుల అంచనాలు కూడా పెరిగాయి.
ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తారని చెప్పబడింది. మరియు ప్రధాన విలన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠిని కూడా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. గబ్బర్ సింగ్ కోసం ఎనర్జిటిక్ ఆల్బమ్ మరియు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ భవదీయుడు భగత్ సింగ్ కోసం కూడా మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారని పవన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూడటం మొదలు పెట్టారు.
అయితే పాపం హరీష్ శంకర్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కాలం వెయిట్ చేసినా.. ఆయన ప్రయత్నాలన్నీ వృధా అయినట్లే కనిపిస్తోంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఆగిపోయినట్లేనని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు ధృవీకరించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఏ సినిమానీ కొత్తగా చేసే ఉద్దేశంలో లేరని తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే ఒకే ఒక్క సినిమా ఉంది. అయితే ఈ సినిమా కూడా షూటింగ్ నిరంతర వాయిదాల మధ్య అస్తవ్యస్తంగా జరుగుతోంది.