షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించగా జనవరి 25 న విడుదల అయిన పఠాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. హిందీ సినిమాల విషయానికొస్తే 100, 200, 300 కోట్ల క్లబ్ లలో అత్యంత వేగంగా వసూళ్లు రాబట్టిన ఈ వీకెండ్ తో 400 కోట్ల క్లబ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
పఠాన్ 13వ రోజు (రెండో సోమవారం) టికెట్ ధరల తగ్గింపుతో నిలకడగా సాగింది. సోమవారం ఈ సినిమాకి ప్రేక్షకుల తాకిడి రెండో శుక్రవారంతో సమానంగా ఉండటం నిలకడైన బాక్సాఫీస్ రన్ కు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బాహుబలి 2 హిందీ వరల్డ్ వైడ్ గ్రాస్ (810 కోట్లు)ను బద్దలు కొట్టి దాదాపు 850 కోట్ల గ్రాస్ వసూలు చేసి హిందీ సినిమాలో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
కొన్నేళ్లుగా దక్షిణాది సినిమాల డబ్బింగ్ వెర్షన్లు కొన్ని అసాధారణ సంఖ్యలతో హిందీ సినిమాలను డామినేట్ చేశాయి. దీనికి తొలి అడుగు వేసింది ఎస్ ఎస్ రాజమౌళి. 2017లో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ హిందీ వెర్షన్ లో ఘనవిజయం సాధించింది. 500 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో ఇండియాలో ఇప్పటికీ టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది.
ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తున్న పఠాన్ ఖచ్చితంగా బాహుబలి 2 లైఫ్ టైమ్ నెట్ ఫిగర్ కు సవాలు విసురుతుంది అని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. మరి ఈ అరుదైన ఘనతను పఠాన్ సాధిస్తుందో లేదో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
పఠాన్ సినిమా కేవలం షారుక్ ఖాన్ కే కాదు, బాలీవుడ్ కు కూడా అత్యంత అవసరమైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ చిత్ర విజయాన్ని ప్రపంచ వ్యాప్తంగా షారుక్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె, జాన్ అబ్రహం నటించిన పఠాన్ ఆదిత్య చోప్రా యొక్క ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్ లో భాగం కాగా.. భవిష్యత్తులో ఈ యూనివర్స్ లో మరిన్ని చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉన్నారు.