షారుఖ్ ఖాన్ తన తాజా చిత్రం పఠాన్ తో ఘనమైన కమ్ బ్యాక్ ఇవ్వడమే కాకుండా, బాలీవుడ్ పరిశ్రమకు కూడా పూర్వ వైభవాన్ని తెచ్చి ఆ రకంగా హిందీ సినిమా మార్కెట్ ను పునరుజ్జీవింపజేశారు.
పఠాన్ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ స్పై థ్రిల్లర్ జనవరి 25న విడుదలైనప్పటి నుంచి రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. మొదటి రోజు రూ.57 కోట్ల సెన్సేషనల్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు రూ.70 కోట్లు, మూడో రోజు రూ.39 కోట్లు, వీకెండ్ లో రూ.53 కోట్లతో మళ్లీ పుంజుకుని ఐదో రోజు (ఆదివారం) రూ.60 కోట్లు వసూలు చేసింది.
పఠాన్ బాక్సాఫీస్ వద్ద ఇండియాలోనే రూ.275 కోట్ల (నెట్) మార్కును దాటింది. కేజీఎఫ్ 2, బాహుబలి 2 హిందీ వెర్షన్లను అధిగమించి కేవలం నాలుగు రోజులలోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా పఠాన్ రికార్డు సృష్టించింది. కాగా కేజీఎఫ్ 2 ఐదవ రోజు, బాహుబలి 2 ఆరవ రోజు 200 కోట్ల మార్కును దాటాయి.
పఠాన్ ఇప్పటికే రూ.57 కోట్ల ఓపెనింగ్ తో రికార్డులను బద్దలు కొట్టింది, ఇది భారతదేశంలో అత్యధిక ఓపెనింగ్ డే మరియు ఇప్పుడు అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ గా కూడా నిలిచింది. రూ.387 కోట్లు కలెక్ట్ చేసి హిందీ సినిమాలలో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన దంగల్ దిశగా పఠాన్ ఇప్పుడు దూసుకెళ్తోంది.
ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగా కూడా పఠాన్ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.542 కోట్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
నాలుగేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్ కు పఠాన్ గణాంకాలు ఒక పండగలా, భారీ ఉపశమనం కలిగిస్తున్నాయి. గతంలో ఆయన నటించిన జీరో, ఫ్యాన్, జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. గత ఏడాది హిందీ సినీ పరిశ్రమలో కూడా తక్కువ శాతం హిట్స్ ఉండటం, కొన్ని సినిమాలు మాత్రమే రూ.200 కోట్ల మార్కును దాటడంతో పఠాన్ యొక్క భారీ విజయం బాలీవుడ్ కు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.