తెలుగు సినీ పరిశ్రమకే కాదు భారత దేశ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక థియేటర్లలో తన సత్తా చాటిన తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ లోనూ తన సత్తా చాటింది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ వల్ల ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గ్లోబల్ రీచ్ వచ్చింది. విదేశీ ప్రేక్షకులే కాకుండా హాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ సినిమాని ప్రశంసలతో ముంచెత్తారు.
ఇక అవెంజర్స్ వంటి ప్రాంచైజీ రూపకర్తలు, ఇటీవల ” ది గ్రే మ్యాన్” ను తెరకెక్కించిన రూసో బ్రదర్స్ ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని చూసి దర్శకుడు రాజమౌళి ని ప్రశంసించడమే కాకుండా ఆయనతో కలసి సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు తెలపడం విశేషం. ఈ నేపథ్యంలో రాజమౌళి మరియు రూసో బ్రదర్స్ తో నెట్ ఫ్లిక్స్ సంస్థ స్పెషల్ ఇంటరాక్షన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వరల్డ్ సినిమా గురించి.. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు వంటి పలు అంశాలపై దర్శకుడు రాజమౌళి మాట్లాడారు.
నెట్ ఫ్లిక్స్ లో భారతదేశం నుండి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ చరిత్ర సృష్టించింది. అలానే 15 విభిన్న భాషల్లోకి సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ చేయబడిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 47 మిలియన్ అవర్స్ కు పైగా వీక్షించబడింది, ఇది కూడా ఒక రికార్డు. ఇక వరుసగా 13 వారాల పాటు ట్రెండింగ్ లో కొనసాగడం మరో విశేషం. ఈ ఊహించని స్పందన తనకెంతో సంతోషాన్ని కలిగించిందని రాజమౌళి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
నిజంగా ఆర్ ఆర్ ఆర్ కు అంతర్జాతీయంగా లభించిన ఆదరణతో ఆశ్చర్యపోయానని ఆయన తెలిపారు.మంచి కథతో తీస్తే అది ఏ రకమైన ప్రేక్షకుడిని అయినా నచ్చుతుందని, కానీ వెస్ట్రన్ సెన్సిబులిటీస్ కి తగ్గట్టుగా సినిమాలు తీయగలనని తాను ఎప్పుడు అనుకోలేదని.. కానీ ఆర్ ఆర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తరువాత ప్రజలు చూడటం ప్రారంభించినప్పుడు.. అద్భుతమయిన స్పందనలు వచ్చినప్పుడు, విమర్శకులు మంచి సమీక్షలు కూడా ఇవ్వడం ప్రారంభించినప్పుడు మాత్రం నిజంగా చాలా ఆశ్చర్యపోయానని రాజమౌళి తెలిపారు.
ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ ఇంటర్వెల్ ఎపిసోడ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ జంతువులతో కలిసి ఓ వ్యాన్ నుంచి దూకే సీన్ క్లిప్పింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే ఏకంగా 3 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది అంటేనే ఆ సన్నివేశం ఎంతగా ప్రభావం చూపింది అనేది అర్థం అవుతుంది. మన భారత సినీ ప్రేక్షకులే కాక విదేశీ ప్రేక్షకులను సైతం ఈ సన్నివేశం ఔరా అనుకునేలా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సన్నివేశం అంతలా ప్రఖ్యాతి పొందింది.
ఈ నేపథ్యంలో రూసో బ్రదర్స్ తో తాజా ఇంటరాక్షన్లో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ఇంటర్వల్ లో ఎన్టీఆర్ పులుల ఎంట్రీ గురించి వివరించారు. ఆ సన్నివేశం ఎన్టీఆర్ క్యారక్టర్ డిజైనింగ్ నుంచి వచ్చిందని.. భీమ్ అడవుల్లో నుండి వచ్చినవాడు. అతనికి జంతువులతో సంబంధం ఉండటం సహజం అని చెప్తూ, ఆ రకంగా ఆ సీక్వెన్స్ ని డిజైన్ చేశామని, ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేయడం తనకు చాలా ఇష్టం అని చెప్పిన రాజమౌళి ఆ సన్నివేశం అందరికీ నచ్చినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు.
ఇక పోతే రూసో బ్రదర్స్ ఈ సంభాషణ గురించి ట్వీట్ చేస్తూ.. ”గ్రేట్ ఎస్.ఎస్. రాజమౌళిని కలవడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాం” అని పేర్కొన్నారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. ”గౌరవం మరియు ఆనందం నావి.. ఇది గొప్ప ఇంటరాక్షన్. మీ క్రాఫ్ట్ ను కలుసుకోవడానికి దాన్నుంచి ఎంతో కొంత నేర్చుకోడానికి ఎదురు చూస్తున్నాను” అని అన్నారు.
కాగా ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తరువాత లభించిన అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకుంది. అల్లూరి సీతారామరాజు – కొమురం భీమ్ వంటి ఇద్దరు నిజ జీవిత స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తితో తెరకిక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందింది.