నటీనటులు: ఆలియా భట్, షెఫాలీ షా, విజయ్ వర్మ, రోషన్ మ్యాథ్యూ తదితరులు
రచన, దర్శకత్వం: జస్మిత్ కే రీన్
డైలాగ్స్: విజయ్ మౌర్య, పర్వీజ్ షేక్, జస్మిత్ రీన్
నిర్మాతలు: గౌరీ ఖాన్, ఆలియా భట్, గౌరవ్ వర్మ
సినిమాటోగ్రఫి: అనిల్ మెహతా
ఎడిటింగ్: నితిన్ బేద్
సంగీతం: ప్రశాంత్ పిళ్లై, విశాల్ భరద్వాజ్
బ్యానర్: రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్
ఓటిటి ప్లాట్ ఫామ్: నెట్‌ఫ్లిక్స్
రేటింగ్: 3/5
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తాజాగా నటించిన సినిమా “డార్లింగ్స్”. నెట్ ఫ్లిక్స్ లో.డైరెక్ట్ గా విడుదలైన ఈ సినిమా వీక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం.
ఈ సినిమా ద్వారా అలియా భట్ మగ వాళ్ళ మీద జరిగే హింసను ప్రోత్సహిస్తుంది అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెగటివ్ పబ్లిసిటీ చేశారు.అయితే సినిమాలో చూపించే హింసకు ఒక బలమైన కారణం మరియు నేపథ్యంతో పాటు చిత్ర బృందం ఉద్దేశ్యం మంచిదైతే.. అందులో ఏమాత్రం తప్పు లేదు.
ఇక ‘డార్లింగ్స్’ కథ విషయానికి వస్తే…. బద్రున్నిసా (అలియాభట్), హమ్జా అబ్దుల్ షేక్ (విజయ్ వర్మ) ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. హమ్జా రైల్వే టీసీగా పనిచేస్తుంటాడు. పెళ్ళైన మూడేళ్ళకే అతను మద్యానికి బానిస అవుతాడు. రాత్రి అయితే చాలు తాగి, భార్య బద్రును కొట్టి హింసిస్తూ.. తెల్లవారగానే మత్తు దిగిపోయి మంచి వాడిలా ఆమెను బ్రతిమలాడుతాడు. బద్రు తల్లి షంషున్నీసా (షఫాలీ షా) కూడా తాను ఉండే పాత అపార్ట్ మెంట్ లో ఉంటుంది. ఇటు తల్లి, అటు కూతురు ఎదురుబొదురు ఫ్లాట్స్ లో నివసిస్తుంటారు. కళ్ళముందే కూతురును అల్లుడు కొడుతుంటే షంషూ భరించలేకపోతుంది. భర్తకు విడాకులిచ్చేసి, తన దగ్గరకు వచ్చేయమని కూతురుకు చెప్తూ ఉంటుంది. కానీ భర్త మీద ప్రేమతో బద్రు ఆ పని చేయలేకపోతుంది. అయితే ఎంతో సహనం మరియు భర్త పై ప్రేమ ఉన్న బద్రు.. ఓ దారుణమైన సంఘటనతో మనసు విరిగి భర్తకు బుద్ధి చెప్పాలనే నిర్ణయం తీసుకుంటుంది. అందుకు తల్లి సాయం కూడా తీసుకుంటుంది. దాంతో పాటు వాళ్ళిద్దరికీ స్నేహితుడైన జుల్ఫీ (రోషన్ మాథ్యూ) వీళ్ళకు ఏ విధంగా సహాయపడ్డాడు? భార్యలో వచ్చిన మార్పుని చూసైనా హమ్జా మారాడా? లేదా? అనేది మిగతా కథ.
భార్యా భర్తలు అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మెలగాలి, అంతే కానీ భర్త అన్న హక్కు అహంకారంతో హద్దు మీరి హింసిస్తే.. అందుకు పర్యావసానం చాలా దారుణంగా ఉంటుందని దర్శకురాలు జస్మిత్ కె రీన్ ‘డార్లింగ్స్ ‘ ద్వారా చెప్పాలనుకున్నారు. గతంలో ఈ తరహా కథతో వచ్చిన సినిమాల్లో సాధారణంగా అయితే మహిళా పాత్రల తాలూకు తిరుగుబాటును ముగింపు సన్నివేశంలో చూపించడం రివాజుగా వచ్చింది. అయితే ఈ బ్లాక్ కామెడీ డ్రామాలో మధ్యలో నుండే భర్త మీద భార్య పగ తీర్చుకోవడమనే అంశాన్ని చూపించారు.
మద్యానికి బానిసైన వ్యక్తి తేలు వంటి వాడని, అలాంటి మనిషిలో మార్పు అంత త్వరగా రాదని బద్రు తల్లి ఆమెతో ఎప్పుడు చెబుతూ.. అందుకు ఉదాహరణగా ఓ కథ కూడా చెబుతుంది. అయితే తల్లి మాటను వింటూనే, బద్రు తన నైజాన్ని వదులుకోకుండా మనిషిగా ప్రవర్తించే క్లయిమాక్స్ లో ఆమె పాత్రలోని గొప్పతనం ప్రేక్షకుల చేత సెల్యూట్ కొట్టిస్తుంది. అలానే… హమ్జా చేసిన దారుణానికి, తప్పు ఒప్పుకుని మనిషిగా మారలేని అతని కుంచిత మనస్తత్వానికి తగిన ముగింపు ఇచ్చి దర్శకురాలు ఆకట్టుకుంటారు.
డార్లింగ్స్’ సినిమాలో మొత్తం నాలుగు పాత్రలు. అందులో ప్రధానమైన బద్రు పాత్రలో నటించిన అలియా భట్ ఒక మధ్య తరగతి ముస్లిం మహిళ పాత్రలో చక్కగా నటించారు. భర్త మీద ఉన్న ప్రేమతో, అతను ఎప్పటికైనా మారతాడు అనే ఆశతో అతని బలహీనతలను సైతం ఓర్పుగా భరించే మహిళ తిరగబడితే ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించి మెప్పించారు. ఆమె తల్లిగా ‘సత్య’ ఫేమ్ షఫాలీ షా తనదైన శైలిలో నటించడమే కాక అందరిలోనూ తన ప్రత్యేకంగా నిలిచారు. ఒక రకంగా చెప్పాలంటే అలియా భట్ పాత్ర కన్న ఈమె పాత్రలోనే భిన్న పార్శ్వాలు ఉండటం విశేషం.
ఇక తెలుగు వాడైన విజయ్ వర్మ బాలీవుడ్ లో తనదైన నటన, పాత్రలతో అటు సినిమాల్లోనూ, ఇటు వెబ్ సీరిస్ ల లోనూ రాణిస్తున్నారు. గతంలో ఆయన తెలుగులో నాని ‘ఎంసీఎ’ సినిమాలో విలన్ పాత్రను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హమ్జా పాత్రకు ప్రాణం పోశారు. కొన్ని సన్నివేశాల్లో ఆయనని చంపెంత కోపం వచ్చేలా ఆ పాత్రలో క్రూరత్వాన్ని పండించారు. తల్లీకూతుళ్ళకు అండగా నిలిచే జుల్ఫీ పాత్రలో రోషన్ మాథ్యు ఆకట్టుకుంటారు.ఇతర ప్రధాన పాత్రలలో కిరణ్ కర్మార్కర్, విజయ్ మౌర్య, రాజేశ్ శర్మ, సంతోష్ జువేకర్ తదితరులు పరవాలేదు.
ప్రశాంత్ పిళ్ళై నేపథ్య సంగీతం బాగుంది. సినిమాలో మూడు పాటలు ఉండగా అవి సాధారణ స్థాయిలో ఉన్నాయి. అనీల్ మెహతా కెమెరా పనితనం కూడా బాగుంది. విజయ్ మౌర్య, పర్వేజ్ షేక్, జస్మిత్ కె రీన్ రాసిన సంభాషణలు సినిమా మూడ్ కు తగ్గట్టుగా ఉన్నాయి.
రెండు గంటల పద్నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో మధ్య దశలో చాలా సన్నివేశాలు రిపీట్ అవడం వల్ల బోర్ కొట్టిన మాట వాస్తవం. అలానే ఆ సమయంలో కథనం కూడా సాదాసీదాగా సాగడంతో ఒక దశలో సినిమా ఎటు వెళుతుందో అర్థం కాదు. అయితే బద్రు పాత్రలో చలనం వచ్చిన తరువాత ‘డార్లింగ్స్’ సినిమా ఊపు అందుకుంటుంది.
గృహహింస వంటి సమాజంలో ఉన్న ఒక తీవ్రమైన సమస్యను దర్శకురాలు ప్రధాన కథా వస్తువుగా తెరకెక్కించడం నిజంగా అభినందించదగ్గ విషయం.
We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at [email protected]. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.