ఈ రోజు తెలుగు ప్రేక్షకులకు భారీ ఆనందాన్ని ఇచ్చేందుకు OTTలో రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు మరేవో కాదు, ఇటీవలే విడుదలై పాన్-ఇండియన్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన పొన్నియిన్ సెల్వన్ మరియు బ్రహ్మాస్త్ర సినిమాలు.
కాగా ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ వేదికలు మాత్రం వేరు వేరు కావడం విశేషం. బ్రహ్మస్త్ర డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, పొన్నియిన్ సెల్వన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.
రెండు సినిమాలు నవంబర్ 4వ తేదీ అంటే ఈ రోజు నుండి OTTలో ప్రసారం కానున్నాయి. కాగా ఈ రెండు సినిమాలు కూడా OTT స్ట్రీమింగ్‌లో మంచి స్పందన తెచ్చుకుంటాయని భావిస్తున్నారు. బ్రహ్మస్త్ర ఇప్పటికే థియేట్రికల్ రిలీజ్‌లో ప్రేక్షకుల నుండి మంచి కలెక్షన్స్ మరియు ప్రశంసలను అందుకోగలిగింది. మరియు ఇప్పుడు OTTలో మళ్లీ అదే స్థాయిలో స్పందన తెచ్చుకోగలదా అనేది చూడాలి.
ఇక సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్లలలో ఒకరైన మణిరత్నం యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వన్ గత వారం అమెజాన్ ప్రైమ్‌లో వచ్చింది. కానీ అది కేవలం అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉండింది. అయితే, ఈ చిత్రం ఈ రోజు నుంచి అమెజాన్ ప్లాట్ ఫారమ్‌లోని సబ్స్క్రైబర్లందరికీ అందుబాటులోకి వచ్చింది.
ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష కృష్ణన్, “జయం” రవి, “చియాన్” విక్రమ్, మరియు కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చారిత్రాత్మక కల్పిత గాథ సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అంతే కాక తమిళనాట ఏకంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
పొన్నియిన్ సెల్వన్ ఒక ప్రముఖ తమిళ నవల ఆధారంగా రూపొందించబడింది, అందుకే దీనికి తెలుగు ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణ లభించలేదు. మరి ఇప్పుడు OTTలో అయినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
మరో వైపు, బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన తర్వాత, అయాన్ ముఖర్జీ యొక్క బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్-శివ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో అలియా భట్ మరియు రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించగా, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున మరియు మౌని రాయ్ కీలక పాత్రల్లో కనిపించారు. షారూఖ్ ఖాన్ కూడా అతిధి పాత్రలో కనిపించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న థియేటర్లలోకి వచ్చింది.