తను చేసే ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్తదనం కూడిన కథలను, పాత్రలను ప్రేక్షకులకి అందించే నటుడు శ్రీవిష్ణు. ఆయన తాజాగా నటించిన సినిమా ‘అల్లూరి’ విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తన ఫంక్షన్ కి వచ్చినందుకు శ్రీ విష్ణు అల్లు అర్జున్‌కి కృతజ్ఞతలు తెలియజేసారు. అల్లు అర్జున్ ప్యాన్-ఇండియా స్టార్ గా ఎదిగిన తీరు గూర్చి గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.
ప్రస్తుతం నడుస్తున్న ప్యాన్-ఇండియా సినిమాల ట్రెండ్ గురించి శ్రీవిష్ణు మాట్లాడుతూ, ఇతర హీరోలకు వారి ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం ప్లానింగ్, ప్రమోషన్లు అవసరం అవుతాయి, కానీ అల్లు అర్జున్ కు అవేమీ అవసరం లేదని, ఆయన సినిమాకు వచ్చేసరికి కేవలం అల్లు అర్జున్ అన్న పేరు మాత్రమే సరిపోతుందని శ్రీ విష్ణు అన్నారు.
హైదరాబాద్‌లో విడుదలైన పుష్ప పాటలు దేశం మొత్తం కాదు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయిన ఉదాహరణను ఈ సందర్భంలో శ్రీ విష్ణు ఉదహరించారు. ఇక ఐకాన్ స్టార్ కూడా శ్రీవిష్ణును ప్రశంసలతో ముంచెత్తారు. గతంలో ఇద్దరూ కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో స్క్రీన్‌ను పంచుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వారి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇక అల్లు అర్జున్, తనకు ఇష్టమైన వ్యక్తి శ్రీవిష్ణు అని చెప్పారు. ప్రేమ్ ఇష్క్ కాదల్ లో ముగ్గురు హీరోలు ఉంటే అందులో శ్రీవిష్ణుది ఒక పాత్ర అని, ఆ పాత్రలో అతను చాలా బాగా చేశాడని అన్నారు. ఆ ఇష్టం వల్లే తాను పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా ఈ ఫంక్షన్ కు వచ్చానని ఆయన తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోవాలని ఆశించారు.
ఇదిలా ఉండగా, అల్లూరి సినిమా సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన కొత్త కథానాయిక కయదు లోహర్ నటించనున్నారు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బెక్కెం వేణు గోపాల్ నిర్మించారు. అల్లూరి సినిమాలో తనికెళ్ల భరణి, సుమన్, పృద్వీ రాజ్ వంటి ఇతర నటీనటులు కనిపించనున్నారు.