కరోనా పాండమిక్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఏ విధంగా మార్పులు వచ్చాయో.. ప్రేక్షకుల అభిరుచి మరియు ఆలోచనా విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. కరోనా సమయంలో ఓటీటీలకు అలవాటు పడిపోవటం వల్ల ఇప్పుడు చాలా జాగర్తగా ఎంచుకుని అసక్తి కలిగించిన సినిమాలనే థియేటర్లలో వచ్చి చూస్తున్నారు.
ప్రచారం సమయంలో సినిమాలో ఏదో ఆసక్తికరమైన విషయం ఉంది అన్న భావన ప్రేక్షకులకు కలిగించక పోతే వాళ్ళు ఏమాత్రం అసక్తి చూపటం లేదు. చక్కని ప్రచార కార్యక్రమాలకు తోడు మంచి మంచి ఆడియో కూడా ఉండి ఈ సినిమా తప్పకుండా చూడాలి అనిపించేలా ఉంటే తప్ప ప్రేక్షకులు థియేటర్ల వైపు కదలట్లేదు. అయితే అంతగా ప్రచారం చేసినా సినిమాలో విషయం లేకపోతే మాత్రం మొదటి ఆట నుంచే ప్రేక్షకులు నిరభ్యంతరంగా తిరస్కరిస్తున్నారు.
అయితే సినిమాలు చూడాలనే విషయంలో ప్రేక్షకులకి ఇన్న క్లారిటీ ఇండస్ట్రీ వర్గాలకు మాత్రం ఉండట్లేదు అనే చెప్పాలి. గత కొన్ని నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక్క విజయం కూడా దక్కలేదు, అయితే అందుకు కారణం సినిమాల్లో తగ్గుతున్న ప్రమాణాలు అనే విషయం గుర్తించకుండా దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత రకరకాల అర్థం లేని నిర్ణయాలు లేదా ఆలోచనలు చేశారు.సినిమా బడ్జెట్ లు తగ్గించాలని.. నటీనటుల పారితోషికాలు తగ్గించడం మొదలు పెట్టాలని, ఓటిటి గడువు పెంచాలని ఇలా అన్ని రకాల నిర్ణయాలకి నిర్మాత దిల్ రాజు ముందుండి నడిపించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ విషయంలో ఇతర నిర్మాతలు ఆయనతో ఏకిభావించలేదు. ఈ వారం విడుదలైన రెండు చిత్రాల ఫలితాలతో వారి వాదనకు బలం చేకూరింది.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ చిత్రం అన్ని ఏరియాల్లో విశేష స్పందన తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా మాస్ ప్రేక్షకులని ఈ చిత్రం బాగా ఆకర్షిస్తోంది. విడుదలకు ముందు ఆన్లైన్ బుకింగ్స్ పర్వాలేదననే స్థాయిలో ఉన్నా.. మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో ధియేటర్ల వద్ద ప్రేక్షకుల రద్దీ పెరిగింది. అసలు ఎన్నో రోజులకు ఒక సినిమాకు చాలా ధియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించటం అందరినీ ఎంతో ఆనందానికి గురి చేసింది. విడుదల అయిన మూడు రోజులకే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసే దిశలో దూసుకుపోతుంది.
మరో వైపు వైజయంతీ మూవీస్ బ్యానర్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘సీతా రామం’ సినిమా కూడా పాజిటివ్ టాక్ తో మొదలయింది. ఎ సెంటర్స్ మరియు మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా చక్కని ఆదరణకు నోచుకోని ప్రతి షోకు కలెక్షన్లలో ఎదుగుదలను చూపిస్తుంది. యూత్ మరియు.ఫ్యామిలీ వర్గం ప్రేక్షకులు ఈ సినిమా పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
‘బింబిసార’ మరియు ‘సీతా రామం’ చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ఏలోనూ మంచి వసూళ్ళు రాబడుతుండటం పట్ల ట్రేడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.. ఇది ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో ఊరటనిచ్చే విషయంగా చెప్పుకోవాలి.
ఈ క్రమంలో ఇతర నిర్మాతలు మరియు ట్రేడ్ వర్గాలు ఈ రెండు చిత్రాల ఫలితాన్ని, ప్రదర్శనను ఉదాహరణగా చూపించి ఇతర నిర్మాతలు దిల్ రాజును తప్పు పడుతున్నారు. మంచి కంటెంట్ తో పాటు ఆసక్తికరమైన కథలతో సరైన విధంగా ప్రచారం చేస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని వారు అంటున్నారు. మూస కథలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఏమాత్రం సిద్ధంగా లేరని.. నిర్మాతలు మరియు దర్శకులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తే పరిశ్రమకు అన్ని రోజులూ మంచి రోజులే అనడంలో ఎలాంటి సందేహం లేదు.