మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 28 ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాకు సంభందించి ప్రతి చిన్న అప్ డేట్ మరియు వార్తలతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఈ ఉగాదికి ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు మరియు తెలుగు నూతన సంవత్సరం శుభ సందర్భంగా టైటిల్ కూడా చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ, అది జరగదని ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ తమ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఈ విషయమై స్పందించారు. ఈ సినిమా పట్ల, టైటిల్ రిలీజ్ పట్ల అభిమానుల ఉత్సాహాన్ని తాము అర్థం చేసుకోగలమని, వారి నిరీక్షణకు పూర్తిగా విలువ ఉంటుందని హామీ ఇచ్చారు.
నిజానికి ఉగాది రోజు గ్లింప్స్ తో టైటిల్ అనౌన్స్ చేయాలని నిర్మాతలు అనుకున్నారు కానీ టైటిల్ ఇంకా ఖరారు కాకపోవడంతో ఆ సన్నాహాలు అన్నిటినీ శ్రీరామనవమికి మార్చారు. ఈ సినిమా టైటిల్ విషయంలో త్రివిక్రమ్ ఏమాత్రం తొందరపడటం లేదట. అందుకే టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. అందుకే కొన్ని టైటిల్స్ ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు, కానీ ఇప్పుడు ఆయన సరైన టైటిల్ కోసం మరింత సమయం తీసుకోవాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.