కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమాలో నటించనున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క ప్రారంభోత్సవ వేడుక ఇటీవలే ఘనంగా జరిగింది, దీనికి తెలుగు చిత్రసీమ నుండి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ చిత్రం భారతదేశం మరచిపోయిన తీరప్రాంతాల నేపథ్యంలో ఉంటుంది కాబట్టి VFX కు భారీ స్థాయిలో ప్రాముఖ్యత ఉంటుంది.
ఇక ఈ సినిమాలో స్టంట్స్ మరియు విజువల్స్ చూసుకోవడానికి చిత్ర బృందం గొప్ప హాలీవుడ్ టెక్నీషియన్లను నియమించింది. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఒక ఫైట్ సీక్వెన్స్‌తో రేపు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ 30వ చిత్రం ఇప్పటి వరకు తన బెస్ట్ వర్క్ అవుతుంది అని కొరటాల శివ పూజా కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులకు భరోసా ఇచ్చారు.
ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో మళ్లీ సెట్స్‌పైకి రావడంతో పాటు ఎన్నో అడ్డంకుల తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించడం పట్ల ఎంతగానో సంతోషిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ 30 షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభం కావాల్సి ఉందన్న సంగతి అందరికీ తెలిసినదే, అయితే ఎన్టీఆర్ యొక్క వ్యక్తిగత కారణాలతో పాటు కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా పనులు ఆలస్యం అయ్యాయి.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాల పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ తెలుగులో అరంగేట్రం చేయనున్నారు. శ్రీకర్ ప్రసాద్ ప్రాజెక్ట్ ఎడిటర్. రత్నవేలు సినిమాటోగ్రఫీని, ప్రొడక్షన్ డిజైన్‌ను సాబు సిరిల్ హ్యాండిల్ చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.