తెలుగు సినిమాలో ఈ రీరిలీజ్ ట్రెండ్ మరికొన్ని బ్లాక్ బస్టర్స్ సినిమాలకు కూడా విస్తరించేలా ఉంది. పోకిరి, ఒక్కడు, జల్సా, ఖుషి చిత్రాల ఘన విజయం తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సింహాద్రి కూడా రీరిలీజ్ కు సిద్ధమవుతోంది.
గత ఏడాది ఆరంభంలో ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా విడుదలై అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కాగా మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమా విడుదల కానుందని సమాచారం.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించగా.. నాజర్, ముఖేష్ రుషి, భాను చందర్ ఇతరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇటీవలే రిలీజైన సినిమాలలాగే.. సింహాద్రి కూడా 4కేలో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ సినిమా విజయం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సింహాద్రి రీరిలీజ్ ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. స్పెషల్ స్క్రీనింగ్స్ విషయంలో ఎన్టీఆర్ సినిమాలకు మంచి రికార్డ్ ఉండటంతో ఖుషి రీరిలీజ్ డే 1 రికార్డును బద్దలు కొడుతుందని ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారు.
2003లో విడుదలైన ‘సింహాద్రి’తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు హీరోగా స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి ఎన్టీఆర్ ను టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా నిలబెట్టింది. కీరవాణి చార్ట్ బస్టర్ మ్యూజిక్, రాజమౌళి పేసి అండ్ ఇంటెన్స్ కథనం, ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఈ సినిమాను టాలీవుడ్ లో యాక్షన్ జానర్ లో ఒక క్లాసిక్ గా నిలబెట్టాయి.