గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా బాక్సాపీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి.. మూడవ రోజు నుండే పంపిణీదారులకి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక లాంగ్ రన్ లో ఈ చిత్రం బయ్యర్లకు మరియు నిర్మాతకు రెట్టింపు లేదా అంతకు మించి లాభాలను తెచ్చి పెట్టినా ఆశ్చర్యం లేదు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ సమయంలో నందమూరి అభిమానులని ఆశ్చర్య పరిచే ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకి వచ్చింది. అదేంటంటే బింబిసార సినిమాలో ఎన్టీఆర్ తో ఒక చిన్న పాత్ర చేయిస్తే బాగుంటుందని అనుకున్నారట. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ బిజీగా ఉండటంతో ఆ పాత్రను ఎన్టీఆర్ చేయలేక పోయారట. ఇప్పుడు బింబిసార చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవడంతో రెండవ భాగంలో ఎన్టీఆర్ ని నటింపజేసే ఆలోచనలో కళ్యాణ్ రామ్ మరియు బింబిసార చిత్ర బృందం ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అదేమీ లేదని, ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు.
అసలు బింబిసారలో ఎన్టీఆర్ ను ఏ రకంగా కూడా భాగం చేయాలని తాము అనుకోలేదని.. ఒక వేళ అలాంటి వార్తలు వచ్చినా అవి కేవలం ఊహాగానాలే అని ఆయన అన్నారు. అయితే అవి కేవలం పుకార్లే అయినప్పటికీ.. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత బింబిసార లాంటి సోషియో ఫాంటసీ చిత్రంలో నటించి ఉంటే ఖచ్చితంగా అది సినిమాకు ఉపయోగపడేది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
ఇక బింబిసార చిత్రం ఘన విజయం సాధించడం పట్ల కళ్యాణ్ రామ్ ఆనందంగా ఉన్నారు. ఆ సినిమాను ఎలా తెరకెక్కించారు అనే వివరాలు ఆయన మీడియాతో పంచుకున్నారు. ముందుగానే బింబిసార సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ లో రెండు భాగాలకి సరిపడా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంచుకున్నామని ఆయన తెలిపారు. అయితే రెండు భాగాలు ఒకేసారి చిత్రీకరిస్తే ఏ భాగానికి కూడా న్యాయం చేయలేమని భావించి ముందుగా ఒక స్థాయిలో మొదటి భాగాన్ని ప్రేక్షకులకి అందించి.. ఆ తరువాత రెండో భాగాన్ని అత్యున్నత స్థాయిలో తెరకెక్కించే ఆలోచన చేశామని కళ్యాణ్ రామ్ తెలిపారు.
మొత్తానికి బింబిసారతో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఆ చిత్రం సీక్వెల్ తో మరింత.ఘన విజయాన్ని, బాక్స్ ఆఫీస్ వద్ద మరో సారి బ్లాక్ బస్టర్ ను అందుకోవాలి అని కోరుకుందాం.