ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యేందుకు అమెరికా వెళ్లడానికి బయల్దేరిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2023 మార్చి 6న హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనిపించారు. ట్రెండీ లుక్ లో కనిపించిన ఈ నటుడు సోమవారం ఉదయం క్యాజువల్ స్వెట్ షర్ట్, ఒక జత జీన్స్ ధరించారు. తమ హీరో మళ్లీ పనిలో పడటం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీం USA లో ఉండి ప్రమోషన్స్ లో తమ వంతు పాత్ర పోషిస్తోండగా తారకరత్న మరణం కారణంగా ఎన్టీఆర్ ఇక్కడే ఉండి ఇప్పుడు పర్యటిస్తున్నారు. రేపటి నుంచి ఆయన కూడా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటారని సమాచారం. ఎన్టీఆర్, చరణ్ లు గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవతో కలిసి నాటు నాటు పాట కోసం లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించనున్నారు.
మార్చి 12న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరిగే ఆస్కార్ 2023 వేడుకకు ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి అంతర్జాతీయ వేడుకలు, కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, ఎన్టీఆర్ ఈ రోజు ఉదయం అమెరికా వెళ్లారు.
ఫిబ్రవరిలో ఎన్టీఆర్ సోదరుడు తారక రత్న మరణించడంతో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంతో కలిసి ఆయన వెళ్లలేకపోయారు. దాంతో ఆ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారా లేదా అని అభిమానులు, యాంటీ ఫ్యాన్స్ గొడవ పడటంతో సోషల్ మీడియాలో అది కాస్తా వివాదానికి దారి తీసింది.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో “ప్రియమైన ఆర్ఆర్ఆర్ అభిమానులు మరియు మద్దతుదారులకు, మేము ఎన్టి రామారావు జూనియర్ ను HCA ఫిల్మ్ అవార్డ్స్ కు హాజరు కావాలని ఆహ్వానించాము, కానీ అతను భారతదేశంలో కొత్త సినిమా షూటింగ్లో ఉన్నాడు. త్వరలోనే ఆయన అమెరికా నుంచి అవార్డులను అందుకోనున్నారు. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అని తెలిపారు.
2023 ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పోటీలో ఉంది. ఈ పాట ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారి గోల్డెన్ గ్లోబ్ లో ప్రశంసలు పొందడంతో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల వేడుకలో పలు అవార్డులను గెలుచుకుంది.