ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్ మెడికల్ యూనివర్శిటీగా మారుస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ నిర్ణయం పై టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయ పరిస్థితుల వేడి తారాస్థాయికి చేరుకుంది.
ఇరు పక్షాల మధ్య ఇలా మాటల యుద్ధం నడుస్తుండగా, ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రకటన కూడా అనుకోని విధంగా వివాదానికి కేంద్రంగా మారింది. ఆ తర్వాత అన్ని వైపుల నుండి ఎన్టీఆర్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు వ్యక్తం అవుతుండడంతో.. ఇక లాభం లేదని తమ హీరో వైపు నిలబడటానికి ఎన్టీఆర్ అభిమానులు రంగంలోకి దిగారు. ఇంతకీ అంతలా దుమారం రేపేలా ఎన్టీఆర్ ఎం ట్వీట్ చేశారు అనేది చూద్దాం.
జూనియర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్‌లో, “ఎన్టీఆర్ మరియు వైఎస్ఆర్ ఇద్దరూ అపారమైన ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఒకరి పేరును మరొకరితో భర్తీ చేయడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు, అలాగని ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. యూనివర్శిటీ పేరు మార్చడం వల్ల ఎన్టీఆర్ సంపాదించిన కీర్తిని, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఆయన ఔన్నత్యాన్ని, తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన జ్ఞాపకాలను చెరిపివేయలేము” అన్నారు.
అయితే టీడీపీ ముఖ్య నాయకులు మరియు ఇతర పార్టీ సభ్యులు ఈ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే టీడీపీ మద్దతుదారులైన కొన్ని మీడియా వర్గాలు ఇది దౌత్యపరంగా చేసిన చాలా చప్పని ప్రకటనగా పేర్కొన్నాయి. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌లను పోలుస్తూ చేసిన ఈ ప్రకటన టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ గారిని అవమానించడమే కాక మరేమీ కాదని వారు అభిప్రాయపడ్డారు.
ABN, Mahaa News మరియు TV5 వంటి న్యూస్ ఛానెల్‌లు ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా సరైన ప్రకటన చేయని కారణంగా జూనియర్ ఎన్టీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ కార్యక్రమాలు జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రధాన లక్ష్యంగా చేసుకోవడమే కాక హద్దులు దాటి వ్యక్తిగత ప్రకటనలు చేయడం ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
ఈ మొత్తం వివాదం వల్ల ఇప్పుడు నందమూరి అభిమానులు కూడా ఇప్పుడు రెండుగా చీలిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీవీ ఛానెల్‌ల పై BoycottABNandMahaaNews అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎదురుదాడి చేయడం ప్రారంభించారు. ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెలియడం లేదు.