సినిమా ఇండస్ట్రీ అంటే సక్సెస్ కు గ్యారంటీ ఉండే చోటు కాదని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో రుజువైంది. అదృష్టం, లేదా ఫలానా సినిమా విడుదలయ్యేటప్పుడు ఉండే పరిస్థితులు సినిమాల విజయంలో లేదా ఏదైనా పరిశ్రమ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలు చేయడానికి లెక్కలు, ఫార్ములాలు ఎప్పటికప్పుడు మారుతున్న తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం.
ఒకానొక సమయంలో ఫలానా హీరో – దర్శకుడి కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ను అతిగా ఊహించుకునే అలవాటు డిస్ట్రిబ్యూటర్లకు ఉండేది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలను భారీ రేటుకు కొనడం ఒక ఆనవాయితీగా ఉండేది. ఎక్కువగా నైజాం ఏరియాలో ఈ పరిస్థితి ఉండేది.
అలాంటి అలవాటు వల్ల నైజాంలో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కోట్ల రూపాయలు నష్టపోయారు. అయితే కాలక్రమేణా అదే ఫలితాన్ని ఎక్కువగా చవిచూడటంతో స్టార్ హీరోల సినిమాలను అధిక ధరలకు కొనుగోలు చేయాలనే ఆలోచనను వారు మెల్లగా విరమించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమాలను కొన్నప్పుడు దిల్ రాజు వంటి పేరున్న, మంచి అనుభవం ఉన్న నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ కూడా ఇదే ఫలితాన్ని చవిచూశారు.
ఈ రెండు సినిమాల వల్ల తాను కోట్లాది రూపాయలు నష్ట పోయానని ఆయన ఓ పాత ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పుడు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం రాబోయే పెద్ద స్టార్ హీరోల సినిమాల విషయంలో నైజాం డిస్ట్రిబ్యూటర్లు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారని తెలియవచ్చింది.
టాప్ 6 హీరోల సినిమాలు నైజాం హక్కులకై 40 కోట్లు, 50 కోట్లు, కొన్ని సినిమాకు 70 – 80 కోట్ల వరకు భారీ రేటుకు కోట్ అవుతున్నాయని సమాచారం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గతంలో నష్టాలు చవిచూసిన తర్వాత కూడా డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమాలను చెప్పిన రేట్లకు కొనడానికి వెనుకాడడం లేదు. రాజమౌళి సినిమాలు తప్ప మరే సినిమా నైజాంలో 50 కోట్ల షేర్ దాటలేదు కాబట్టి ఇంత భారీ రేటుకు సినిమాలను కొనడం పెద్ద రిస్క్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.