కేరళ నుండి తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నటిగా చక్కని పేరును మరియు గుర్తింపును తెచ్చుకున్న నటి నిత్యా మీనన్. సహజంగా నటిస్తారు అనే పేరు ఉన్న నిత్యా, అందుకు తగ్గట్టే తను చేసే సినిమాలను చాలా జాగర్తగా ఎంచుకుంటారు. సంఖ్య కన్నా మంచి పాత్రలకే ఆవిడ ఓటు వేస్తారు.
ఇదిలా ఉండగా ఈ కేరళ బ్యూటీ పెళ్ళి చేసుకోబోతోందనే ఒక పుకారు ఈ మధ్య తెగ చక్కర్లు కొట్టింది. ఓ మలయాళ నటుడితో నిత్యా మీనన్ పెళ్ళి పీటలెక్కబోతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే. ఫలానా హీరోని నిత్యా మీనన్ పెళ్ళాడనుందంటూ ఆ హీరో పేర్లను కూడా ప్రచారంలోకి తెచ్చేశారు. దాదాపు నలుగురైదుగురు హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
తన పెళ్ళి గురించి సోషల్ మీడియాలో, అలాగే మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ స్పష్టం చేసేసారు. కొందరు కావాలనే చేస్తున్న ఈ దుష్ప్రచారం చాలా బాధాకరంగా ఉందని, ఇకపై ఈ వార్తలు ఇకనైనా ఆగిపోతాయని తాను ఆశిస్తున్నట్లు నిత్యామీనన్ చెప్పారు.
ఇటీవలే పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ లో నటించిన తరువాత..ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ సినిమాలతో, అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ వంటి ఓటీటీ షోలలోనూ నిత్యా మీనన్ బిజీగా ఉన్నారు.
అయితే గతంలోనూ నిత్యా మీనన్ పెళ్ళి గురించి చాలా పుకార్లు వచ్చాయి. ప్రేమ పెళ్ళి, పెద్దలు కుదిర్చిన పెళ్ళి.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.. అవన్నీ ఉట్టి గాలి వార్తలని ఆ తరువాత రుజువైంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏదేమైనా కేవలం సినీరంగంలో ఉన్నంత మాత్రాన ఇలా హీరో హీరోయిన్ల వ్యక్తిగత జీవితంలోని విషయాల గురించి ఇలా పిచ్చి వార్తలు ప్రచారం ఎందుకు చేస్తారో అందువల్ల ఏం లాభం ఉంటుందో ఎవరికీ తెలియదు..