ఈ మధ్య కాలంలో దక్షిణాదిన హీరోల సినిమాలు రికార్డు స్థాయి బిజినెస్ ని సొంతం చేసుకుంటున్నాయి. థియేట్రికల్ బిజినెస్ తో పాటు నాన్ థియేట్రిక్ రైట్స్ పరంగానూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ `దసరా`, విజయ్ “వరిసు”, శివ కార్తికేయన్ ” ప్రిన్స్” సినిమాలు థియేట్రికల్ రైట్స్ తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ జరుపుకున్న విషయం తెలిసిందే. అదే కోవలో నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటిస్తున్న సినిమా విషయంలోనూ అదే జరగనుండటం విశేషం.
నందమూరి బాలకృష్ణ గత ఏడాది డిసెంబర్లో అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత మాంచి ఊపు మీద ఉన్నారు. `అఖండ` అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టింది. ఈ సినిమా విజయంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న బాలకృష్ణ తన తదుపరి సినిమాని గోపీచంద్ మలినేని తో చేస్తున్న విషయం తెలిసిందే. NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మలయాళ నటి హానీ రోస్ మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ అఖండ లాగే రెండు పాత్రల్లో కనిపించబోతున్నారని తెలిసింది. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇటీవలే టర్కీ వెళ్లింది.
అక్కడ పలు సన్నివేశాలతో పాటు ఓ రొమాంటిక్ సాంగ్ ని పూర్తి చేసుకున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది.
ఈ చిత్రానికి అన్ని రకాల వైపు నుంచి చాలా భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఆ క్రమంలో ఈ చిత్రం 130 కోట్ల భారీ మొత్తానికి వ్యాపారం జరుపుకుంటుందని అంచనా వేస్తున్నారు. కాగా అందులో నాన్ థియేట్రికల్ హక్కులు దాదాపు 60 కోట్లకు అమ్ముడవగా.. థియేట్రికల్స్ 70 కోట్లకు పైగా సులభంగా అమ్ముడవుతాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో పంపిణీదారులు ఇప్పటికే ఫ్యాన్సీ ఆఫర్‌లను ఇస్తున్నారట.
మరో వైపు చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్ ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కుంటుంది. ఆ చిత్ర నిర్మాతలు చేప్పిన ధరలకు డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవట్లేదు అని సమాచారం. ఇక నాగార్జున ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ రేసు నుండి పూర్తిగా తప్పుకున్నట్లు పరిస్థితి ఏర్పడింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఘోస్ట్ మటుకు కాస్త మంచి ఆఫర్లనే పొందవచ్చు అంటున్నారు.
ఇక వెంకటేష్ చాలా కాలంగా సోలో హీరోగా సినిమాలు చేయటం తగ్గించేశారు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు బాక్సాఫీస్ రేసులో లేరు. ప్రస్తుతం వీరందరిలో బాలకృష్ణ మంచి ఫాంలో ఉండటం వలన డిస్ట్రిబ్యూటర్లు ఆయన సినిమాల పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.