లేడీ సూపర్‌స్టార్ నయనతార – దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు తాము తల్లిదండ్రులని ఇటీవలే ప్రకటించారు. తమకు కవలలు పుట్టారని సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు.
పెళ్లయిన నాలుగు నెలలకే తమకు కవలలు పుట్టారని నయనతార, విఘ్నేష్ ప్రకటించగానే.. సరోగసీ ద్వారా ఆ జంట తల్లిదండ్రులు అయ్యారని అందరికీ అర్థమైంది.
అయితే ఈ జంట నిబంధనల ప్రకారమే సరోగసీ పద్ధతిని అనుసరించారా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నయనతార దంపతులకు తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ జంట సరోగసీ చట్టాలను ఉల్లంఘించారా అనే దానిపై విచారణ ప్రారంభించనున్నట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.
విఘ్నేష్ – నయనతార జంట సరోగసీ చట్టబద్ధమైనదా కాదా అనే దాని పై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారట. ఈ కమిటీ వారంలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఏర్పాటు చేశారని కూడా అంటున్నారు . ఇందులో భాగంగానే నయనతార, విఘ్నేష్ శివన్ లను విచారించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సమస్య నుంచి చట్టభద్దంగా బయటపడాలని సెలబ్రిటీ జంట తగిన సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. సరోగసీ ద్వారా పిల్లలను పొందేందుకు భారతీయ చట్టం కొన్ని నిబంధనలను కలిగి ఉంది. ఈ చట్టం జనవరి 2022లో అమల్లోకి వచ్చింది. ఇందులో ఉన్న నిబంధనలను నయనతార జంట ఉల్లంఘించారనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ.
తమ వివాహం ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ అయిందని నయనతార, విఘ్నేష్ తమిళనాడు ఆరోగ్య శాఖకు అఫిడవిట్ ఇచ్చారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ వివరణ అత్యంత అవసరమైన సమయంలో వచ్చిందనే చెప్పాలి.
అక్టోబర్ 9న విఘ్నేష్ శివన్ ట్విట్ చేస్తూ.. తాము కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యామని ప్రకటించారు. ఈ ఏడాది జూన్‌లో వీరి వివాహం జరిగింది.
ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం, పెళ్లయిన తర్వాత కనీసం ఐదేళ్లయినా పిల్లలు లేకపోతే జంటలు సరోగసీని ఎంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట తన వాదనలు వినిపించింది. వారు అఫిడవిట్‌తో పాటు వివాహ రిజిస్ట్రేషన్ పత్రాన్ని సమర్పించినట్లు సమాచారం. హెల్త్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం దీని పై విచారణ జరుపుతోంది.
అలాగే కవలలు జన్మించిన చెన్నైలోని ఆసుపత్రిని కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో ఉన్న ఓ మలయాళీ కవలలకు జన్మనిచ్చినట్లు కూడా వెల్లడైంది. మరి ఈ వివాదం తొందరలోనే సమసిపోవాలని కోరుకుందాం.