నాని తాజా చిత్రం దసరా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్ర సంగీత దర్శకుడు కూడా సినిమా యొక్క విజయం పట్ల నమ్మకంగా ఉన్నారు. గత పదేళ్లుగా తెలుగులో 90కి పైగా స్క్రిప్టులు విన్నానని, అయితే అందులో దసరా బెస్ట్ ఫిల్మ్ అని, ఈ సినిమాని ప్రేక్షకులు ఒక సంబరంలా చేసుకుంటారని, ఆరోజు కోసం తాను నిరీక్షిస్తున్నట్లు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అలాగే సినిమాని తెరకెక్కించే విషయంలో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ కీ చాలా పోలికలు ఉన్నాయని సంతోష్ చెప్పారు. ‘బాలు మహేంద్ర నుంచి వెట్రి మారన్, పా రంజిత్ వరకూ సహజత్వాన్ని తెర పై ప్రదర్శించే దర్శకులు తమిళ సినిమాలో చాలా మంది ఉన్నారు. తెలుగులో ఇలాంటి దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నా ఆ స్పేస్ ను శ్రీకాంత్ బద్దలు కొట్టబోతున్నాడు’ అని ఆయన తెలిపారు.
ఇక దసరా సినిమా క్రేజ్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర భాషా ప్రాంతాల్లో కూడా పాకింది. ఇటీవల, దసరా లుక్ లో నానిని ప్రతిబింబిస్తూ పలువురు అభిమానులు భారీ తరహాలో రంగోలిని రూపొందించారు. మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన నాని అభిమానులు ఈ నటుడిని గౌరవించే భారీ రంగోలిని రూపొందించారు. ‘దసరా’ లుక్ లో హైలైట్ గా నిలిచిన ఈ చిత్రం విడుదల తేదీని చూపిస్తూ తెలుగు రాష్ట్రాలకు ధీటుగా నాని పాపులారిటీని చాటింది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.
నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్, రాజశేఖర్ అనింగి తదితరులు ఈ చిత్రంలోని ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరి ఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.