నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా అనే పక్కా మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనుంది. కాగా ఈ సినిమాలో బొగ్గు గనిలో పని చేసే కూలీగా కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన టీజర్‌లు ఇప్పటికే సంచలనం సృష్టించి సినిమా పై అంచనాలను పెంచేశాయి.
కాగా దసరా చిత్ర నిర్మాత అయిన సుధాకర్ చెరుకూరి ఇప్పటి దాకా సినిమాకి వచ్చిన అవుట్పుట్ చూసి చాలా సంతోషపడ్డారట. ఈ సందర్భంగా ఆయన నటీనటులు మరియు సిబ్బందికి ఖరీదైన బహుమతులు ఇచ్చారని సమాచారం.
సాధారణంగా, ఇలాంటి బహుమతులు సినిమా పూర్తయిన తర్వాత లేదా సినిమా విజయవంతమైన ఫలితం వచ్చిన తర్వాత ఆయా సిబ్బందికి ఇవ్వబడతాయి.
భరత్ అనే నేను సమయంలో మహేష్ బాబు నుండి అలాంటి ఉదంతాలు మనం చూశాము లేదా ఆ విషయానికొస్తే, తమిళ స్టార్ హీరో విజయ్ ఎక్కువగా తన చిత్ర బృందానికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు దసరా సినిమా నిర్మాత సుధాకర్ చిత్ర బృందం లోని ప్రతి ఒక్కరికీ ఐఫోన్‌లను బహుమతిగా అందించారట.
సినిమా పరిశ్రమ కమర్షియల్‌గా ఉంటుందని, ఇక్కడి మనుషులు కేవలం డబ్బును మాత్రమే ఇష్టపడతారని చాలా మంది అనుకుంటారు..ఆ మాట నిజమే కానీ.. సుధాకర్ లాంటి నిర్మాతలు కూడా ఒక మెట్టు దాటి తమకు అనిపించినట్టే సంతోషాన్ని ఇచ్చే ఇలాంటి పనులు చేస్తుంటారు.
మంచి పనిని మెచ్చుకోవడం ఎవరికైనా ఉత్సాహాన్ని మరియు ఆనందాన్ని ఇస్తుంది. ఇంద్ర కాలంలో, పరుచూరి గోపాలకృష్ణ ఒక పేజీ నిడివి గల స్క్రిప్ట్‌కి బదులుగా మంచి వన్ లైనర్ డైలాగ్‌ని సూచించినప్పుడు, చిరంజీవి గోపాలకృష్ణను మెచ్చుకుని ఆయనకు కొత్త ఎరిక్ సన్ మొబైల్ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చారట. పరుచూరి ఇప్పటికీ ఆ జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటునే ఉన్నారు.
అందువల్ల, ఇటువంటి బహుమతులు ఇవ్వడం అనేది సినిమా తారాగణం మరియు సిబ్బందికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపులా.. ప్రోత్సాహకరంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
దసరా సినిమాని నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓడెల తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి తమిళ సంగీత సంచలనం సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మహనటి ఫేం కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నారు.